ఉత్తరప్రదేశ్ పోలీసులపై ఓ మహిళా కాంగ్రెస్ నేత తీవ్ర విమర్శలు చేశారు. యూపీ పోలీసోళ్లు తన బట్టల్ని చించేశారు అంటూ ఢిల్లీ మహిళా కాంగ్రెస్(డీపీఎంసీ) అధ్యక్షురాలు అమృత ధావన్ ఆరోపించారు. నిన్న హత్రాస్‌కు వెళ్తున్న రాహుల్, ప్రియాంక గాంధీలను యమునా ఎక్స్‌ప్రెస్ వేపై యూపీ పోలీసులు అడ్డుకున్నారు. వారి వెంట అమృత కూడా ఉన్నారు. అయితే తోపులాట జరిగిన సమయంలో తన బట్టలను పోలీసులు చింపేశారని అమృత తెలిపారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలం అయ్యాయని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.
మీ బలాలను నేరస్తులపై ప్రయోగించండి కానీ, ప్రశ్నించేవారి మీద కాదు అని ఆమె పోలీసులకు సూచించారు. మహిళల బట్టలను చింపేయడం వల్ల ఏం సాధిస్తారు? అని ఆమె ఘాటుగా ప్రశ్నించారు. కాగా, అమృత వ్యాఖ్యలపై నోయిడా డీసీపీ వ్రిందా శుక్లా స్పందించారు. రాహుల్, ప్రియాంకను అడ్డుకున్న సమయంలో తాను అక్కడే ఉన్నానని.. మహిళా పోలీసులు కూడా ఉన్నానని పేర్కొన్నారు. ఏ మహిళ గౌరవానికి కూడా భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని డీసీపీ శుక్లా వెల్లడించారు. ఆమె ఆరోపణలు అవాస్తవం అని కొట్టిపారేశారు.