షేవింగ్ తర్వాత గొడవ.. రూ.20 కోసం హత్య  - MicTv.in - Telugu News
mictv telugu

షేవింగ్ తర్వాత గొడవ.. రూ.20 కోసం హత్య 

September 28, 2020

Delhi man ‘beaten to no more’ by barber shop owner before teenage son over payment of Rs 20

దుకాణాలు పెట్టుకున్నవారికి ఎంత ఓపిక ఉండాలి. కొందరు కష్టమర్లు డబ్బులు లేకుండా వచ్చినప్పుడు కాస్త ముఖం చూసి కష్టమర్లను కాపాడుకోవాలి. అంతేగానీ కష్టమర్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే వారు వేరే షాపు చూసుకుంటారు. అయితే ఓ బార్బర్ షాపు అతను మాత్రం కేవలం రూ.20 కోసం కష్టమర్ ప్రాణాలు తీశాడు. షేవింగ్ చేయించుకుని ఇరవై రూపాయలు తక్కువ ఇచ్చాడు. అవి ఇప్పుడే ఇవ్వాలని బార్బర్ షాపు అతను అడిగాడు. అతను తర్వాత ఇస్తానని చెప్పినా వినకుండా కర్రలతో కొట్టి అతన్ని హత్య చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఈ నెల 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

బురారీ ప్రాంతంలో నివాసం ఉండే రూపేశ్‌ అనే వ్యక్తి స్థానికంగా ఉండే బార్బర్‌ దుకాణానికి క్షవరం చేయించుకోడానికి వెళ్లాడు. షేవింగ్ చేసుకున్నాక రూ.50 ఇవ్వమని షేవింగ్ చేసిన సంతోష్, రూపేష్‌ను అడిగారు. అందుకు రూపేశ్‌ రూ.30 ఇచ్చి మిగతా రూ.20 తర్వాత ఇస్తానని చెప్పాడు. అయితే మిగతా రూ.20 కూడా వెంటనే ఇవ్వాలని సంతోష్ అతని సోదరుడు సరోజ్‌పట్టుబట్టారు. ఈ క్రమంలో వారి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది. విచక్షణ కోల్పోయిన ఇద్దరు సోదరులు రూపేశ్‌ను కర్రలతో కొట్టారు. తీవ్ర గాయాల పాలైన రూపేష్‌ను ఆసుప్రతికి తరలించారు. బాధితుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై తమకు సోమవారం ఫిర్యాదు అందిందని.. కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.