Delhi: Man chops live-in partner into 35 pieces
mictv telugu

పెళ్లి చేసుకోమన్నందుకు.. 35 ముక్కలుగా కోసి..

November 14, 2022

అత్యంత పాశవికంగా గర్ల్ ఫ్రెండ్‌ని హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. తననే నమ్ముకుని వచ్చిన అమ్మాయిని కడతేర్చాడు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా బయటపడింది. ఈ హత్య కేసుకి సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ముంబైలో ఓ కాల్ సెంటర్‌లో ఉద్యోగం చేస్తున్న శ్రద్ధా అనే యువతికి అఫ్తాబ్ అమీన్ పూనావాలా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారి ఇద్దరూ సహ జీవనం చేశారు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలిసి ఆమెను మందలించారు. వారి బంధాన్ని అంగీకరించకపోవడంతో కుటుంబాలను ఎదురించి ముంబై నుంచి ఢిల్లీకి పారిపోయి వచ్చి మెహ్రౌలీలో కలిసి ఉంటున్నారు.

 

Shraddha, aftab

ఈ క్రమంలో శ్రద్ధా, అఫ్తాబ్ ను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసేది. వారి మధ్య తరచూ పెళ్లి గురించి గొడవలు జరుగుతుండేవి. అవి ఒకరోజు తీవ్రరూపం దాల్చి ఇద్దరూ ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో శ్రద్ధాను అమీన్‌ హత్య చేశాడు. మే 18న అఫ్తాబ్, శ్రద్ధా గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేసి వాటి కోసం ఓ కొత్త ఫ్రిడ్జ్ కొని అందులో భద్రపరిచాడు. ప్రతీ రోజు తెల్లవారుజామున 2 గంటలకు ఇంటి నుంచి ఈ ముక్కలను ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పారేసి ఉదయం ఇంటికి తిరిగి వచ్చేవాడు. 18 రోజుల పాటు ఇలా శ్రద్ధా శరీర భాగాలను ఢిల్లీలోని పలు ప్రదేశాల్లో విసిరేశారు.

వెళ్లిన కొన్ని రోజుల తర్వాత శ్రద్ధా కుటుంబ సభ్యుల ఫోన్లకు స్పందించడం మానేసింది. దీంతో తండ్రి వికాస్ మదన్ తన కుమార్తె శ్రద్ధను చూసేందుకు ఢిల్లీ వచ్చారు. ఆ సమయంలో ఫ్లాట్ కు తాళం వేసి ఉంది. దీంతో ఆయన మెహ్రౌలి పోలీసులను ఆశ్రయించారు. కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న మెహ్రౌలి పోలీసులు కేసును దర్యాప్తు చేయగా.. విస్తూ పోయే నిజాలు బయటపడ్డాయి. ఆరు నెలల తర్వాత శనివారం అఫ్తాబ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో శ్రద్ధ తనను వివాహం చేసుకోవాలని కోరడంతో గొడవలు జరిగేవని.. అందుకే చంపేసినట్లు వెల్లడించాడు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు శ్రద్ధ మృతదేహం కోసం గాలిస్తున్నారు.