Delhi model, girlfriend who used to supply drugs in Delhi University, arrested
mictv telugu

ప్రెగ్నెంట్ అంటూ నాటకం.. డ్రగ్స్‌తో పట్టుబడ్డ మోడల్

July 19, 2022

దేశ రాజధాని ఢిల్లీలో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు పోలీసులు. కోటి రూపాయల విలువైన డ్రగ్స్‌తో శుభమ్ మల్హోత్రా(25) అనే మోడల్‌తో పాటు అతని స్నేహితురాలు కీర్తి(27)ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ లో డ్రగ్స్ సరఫరా చేసేవారని పోలీసులు తెలిపారు. ఢిల్లీ యూనివర్శిటీకి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పక్కా సమాచారం మేరకు దర్యాప్తు ప్రారంభించామని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రోహిత్ మీనా తెలిపారు. డగ్ర్‌ తరలిస్తున్న సమయంలో శుభమ్, కీర్తిలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని తెలిపారు. శుభమ్, స్నేహితురాలు కీర్తి లు హిమాచల్‌ ప్రదేశ్ లో గంజాయిని కొనుగోలు చేసి.. కారులో గంజాయిని ఢిల్లీకి స్మగ్లింగ్ చేసేవారని తమ దర్యాప్తులో తేలినట్లు మీడియాకు తెలిపారు.

యూనివర్శిటీకి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రతిసారి ఆ కారుని భద్రతాదళాలు తనిఖీలు చేస్తున్న సమయంలో తప్పించుకోవడానికి ఇరువురు సినీ ఫక్కీలో నాటకం ఆడేవారని.. కీర్తి గర్భవతిగా నటిస్తుందని.. అందుకోసం ఒక దిండుని ఉపయోగించేదని చెప్పారు. జూలై 12న.. శుభమ్ హిమాచల్‌లో ఉన్నట్లు క్రైం బ్రాంచ్‌కు సమాచారం అందగా… వీరిద్దరిని పట్టుకునేందుకు పోలీసులు పక్కా స్కెచ్ వేశారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఢిల్లీ తిరిగి వస్తుండగా.. ఢిల్లీ సింధు సరిహద్దు వద్ద తనిఖీలు చేపట్టారు. పోలీసులను గమనించిన ఆ ఇద్దరు తప్పించుకునేందుకు యత్నించారు. భారీ వర్షాల మధ్య వారిద్దరినీ వెంబడించి.. ఢిల్లీలోని గుప్తాచౌక్ వద్ద నిందితులను పట్టుకున్నామని పోలీసులు చెప్పారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.