Delhi most unsafe metropolitan city for women in India: NCRB data
mictv telugu

దేశానికే అప్రతిష్ట.. మహిళలకు రక్షణలేని నగరం అదే..

August 30, 2022

దేశంలో మహిళలకు అంతగా సురక్షితం కాని నగరాల జాబితాలో ఢిల్లీ తొలి స్థానంలో నిలిచింది. దేశ రాజధానిలో గత ఏడాది ప్రతి రోజూ ఇద్దరు మైనర్ అమ్మాయిలపై రేప్‌లు జరిగాయని ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్ వెల్లడించింది. 2021లో ఢిల్లీలో మహిళలపై 13,892 నేరాలు జరిగినట్లు కేసులు నమోదయ్యాయి. 2020లో ఢిల్లీలో 9782 కేసులు నమోదయ్యాయి. అంటే ఏడాది వ్యవధిలోనే 40 శాతం కేసులు అధికంగా నమోదు కావడం గమనార్హం.

దేశంలోని 19 మెట్రోపాలిటన్ నగరాల్లో మహిళలపై జరిగిన నేరాల వివరాలను పరిశీలిస్తే.. ఒక్క ఢిల్లీలోనే 32.20 శాతం మహిళలపై నేరాలు జరగడం గమనార్హం. ఢిల్లీ తర్వాతి స్థానంలో ముంబై నగరం ఉంది. దేశ ఆర్థిక రాజధానిలో గత ఏడాది మహిళలపై 5543 నేరాలు నమోదయ్యాయి. బెంగళూరులో 3127 నమోదయ్యాయి. 19 నగరాల్లో నమోదైన నేరాల్లో ముంబై వాటా 12.76 శాతం కాగా.. బెంగళూరు వాటా 7.2 శాతంగా ఉంది. దేశంలోని 19 మెట్రోపాలిటన్ నగరాల్లో మహిళలపై జరుగుతున్న 50 శాతానికిపైగా కేవలం ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లోనే చోటు చేసుకున్నాయి.

రాజధానిలో 2021లో 136 వరకట్న మరణాల కేసులు నమోదయ్యాయి. మహిళల అపహరణ, కిడ్నాప్ కేసులు 3,948 వెలుగు చూశాయి. అదే సమయంలో మిగతా మెట్రోపాలిటన్ నగరాల్లో మొత్తం 8,664 కేసులు వచ్చాయి. గతేడాది మహిళలపై 2,022 దాడులు , లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం కింద 1,357 కేసులు నమోదయ్యాయని ఎన్సీఆర్బీ తెలిపింది. ఆ సంస్థ లెక్కల ప్రకారం గతేడాది అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో కంటే అత్యధికంగా ఢిల్లీలో 833 బాలికలపై అత్యాచారం కేసులు నమోదయ్యాయి.