దేశ రాజధాని వేదికగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం నిరాహార దీక్షకు పూనుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చివరి క్షణంలో చుక్కెదురైంది. జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయొద్దని ఢిల్లీ పోలీసులు ఆమెకు తేల్చి చెప్పారు. ఇంకెక్కడైనా దీక్ష చేసుకోవాలని సూచించారు. దీక్షపై ఆమె విలేకర్లకు వివరాలు వెల్లడిస్తున్న సమయంలోనే ఈ సమాచారం అందించడం గమనార్హం. చట్టసభలో మూడో వంతు సీట్లను మహిళలకు ఇవ్వాన్న రిజర్వేషన్ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదించాలని కోరుతూ కవిత శుక్రవారం(ఈ నెల 10న) జంతర్ మంతర్ వద్ద దీక్షకు ఏర్పాట్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
దీని కోసం ఆమె గురువారం హైదరాబాద్ నుంచి హస్తిన చేరుకుని ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. అయితే చివరి క్షణంలో వేదిక మార్చుకోవాలని పోలీసులు చెప్పడంతో భగ్గుమన్నారు. ముందు అనుమతి ఇచ్చి ఇప్పుడు కాదంటే ఎలా అని మండిపడ్డారు. ఏదేమైనా సరే అక్కడే దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. జంతర్ మంతర్ దగ్గర శుక్రవారం వేరే నిరసనలు, ధర్నాలు ఉన్నాయని, కవిత దీక్షకు కొద్ది స్థలానికే పరిమితం చేసుకోవాని సూచిస్తున్నట్లు సమాచారం.