ఢిల్లీలోని రాహుల్ గాంధి నివాసం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారీగా పోలీసులు ఆయన నివాసాన్ని చుట్టుముట్టారు. ఇటీవల భారత్ జోడో యాత్రలో భాగంగా మహిళలపై ఇంకా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని, యాత్రలో చాలామంది మహిళలు తనతో ఈ విషయం చెప్పారని వ్యాఖ్యానించారు.ఇండియా జోడో యాత్రలో జమ్మూ కాశ్మీర్ చేరుకున్న రాహుల్ అత్యాచారానికి గురైన బాలిక గురించి ప్రస్తావించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ, కాంగ్రెస్ మధ్య వీటిపై మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలోనే పోలీసులు అత్యాచార బాధితులు వివరాలు చెప్పాలని రాహుల్‌ను ప్రశ్నిస్తున్నారు. ఇందుకోసం ఈనెల 15న కలవాలన్నారు. కానీ కుదరకపోవడంతో తర్వాత రాహుల్ కి నోటీసులు పంపారు. రాహుల్ స్పందించకపోవడంతో నేడు ఆయన నివాసానికి భారీగా పోలీసులు వచ్చారు. అత్యాచారానికి గురైన బాధితులు వివరాలు సేకరించడానికే వచ్చామని పోలీసులు చెబుతున్నారు. రాహుల్ గాంధీ వివరాలు వెల్లడిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామంటున్నారు.
భారీ సంఖ్యలో పోలీసులు చేరుకున్న సమయంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఎంపీలు అభిషేక్ మను సింఘ్వీ, జైరాం రమేశ్ తదితరులు రాహుల్ నివాసానికి తరలి వచ్చారు. దీంతో రాహుల్ ఇంటి వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాసేపటికే పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పరిస్థితి సద్ధుమణిగింది.
పోలీసుల తీరుపై కాంగ్రెస్ మండిపడుతోంది. అదానీ అక్రమాలకు సమధానం చెప్పలేకనే మోదీ వేధింపుల పర్వం మొదలుపెట్టారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో వేలాది మంది మహిళలు తమ బాధలను పంచుకున్నారని తెలిపారు.