కోర్టు ముందుకు జుబైర్.. బెయిల్ కోసం దరఖాస్తు..తీర్పు రిజర్వ్ - MicTv.in - Telugu News
mictv telugu

కోర్టు ముందుకు జుబైర్.. బెయిల్ కోసం దరఖాస్తు..తీర్పు రిజర్వ్

July 2, 2022

హిందూ దేవతను అవమానించాడన్న ఆరోపణలతో అరెస్టైన ప్రముఖ జర్నలిస్ట్, ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్ను పోలీసులు ఈరోజు కోర్టు ముందు హాజరుపర్చారు. జుబైర్ను 14రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని కోరారు. కస్టోడియల్ విచారణ ముగిసిందని, విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని, జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని పోలీసులు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ స్నిగ్ధ సర్వారియాను కోరారు. జుబైర్పై నమోదైన కేసులకు.. నేరపూరిత కుట్ర, ఆధారాల చెరిపివేత సహా విదేశీ విరాళాల చట్టం ప్రకారం మరిన్ని సెక్షన్లను చేర్చినట్లు పోలీసులు వివరించారు.

ఇదే సమయంలో జుబేర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తన విచారణ పూర్తైన నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. పోలీసులు సీజ్ చేసిన ఫోన్ నుంచి తాను ఆ ట్వీట్ చేయలేదని స్పష్టం చేశారు. “ఆ ట్వీట్ 2018కి సంబంధించినది. అప్పుడు నేను వాడిన ఫోన్ ఇది కాదు. నేను ఆ ట్వీట్ ను ఖండించడం లేదు” అని జుబేర్ తరపు లాయర్ కోర్టు ముందు వాదనలు వినిపించారు. జుబేర్‌పై గతంలో ఐపీసీలోని సెక్షన్‌లు 153, 295 కింద కేసు నమోదు చేశారు.