పోలీసులు నా బట్టలు చింపేశారు.. మహిళా ఎంపీ అసహనం - MicTv.in - Telugu News
mictv telugu

పోలీసులు నా బట్టలు చింపేశారు.. మహిళా ఎంపీ అసహనం

June 16, 2022

ఢిల్లీ పోలీసులు తన బట్టలు చింపేశారంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మహిళా ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సభ్యులపై పోలీసులు ఇలా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణించాలంటూ లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను తమిళనాడుకు చెందిన ఎంపీ జ్యోతిమణి డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు నిరసనకారులతో దురుసుగా ప్రవర్తించారు.

ఇదే సమయంలో పోలీసులు వైఖరిపై తమిళనాడులోని కరూర్ ఎంపీ జ్యోతిమణి తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులు తనపై దాడి చేసి, దుస్తులు చించేశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ పార్టీ సీనియర్‌ నేత శశిథరూర్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఢిల్లీ పోలీసులు తమపై దారుణంగా దాడి చేశారన్న ఎంపీ జ్యోతిమణి.. బూట్లను లాగేసి, దుస్తులు చించేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వలేదని, కొనుక్కునేందుకు షాపుకు వెళ్తే వారినీ బెదిరించారని ఆవేదన చెందారు. ఒక మహిళా ఎంపీ పట్ల పోలీసులు ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా అని ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై లోక్‌సభ స్పీకర్‌ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.