ఢిల్లీలో కరోనా కలకలం.. ఒక్కరోజే 508 కేసులు, 30 మంది మృతి
దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా మహమ్మారి రెచ్చిపోతోంది. ఢిల్లీలో కరోనా భయంకరంగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 508 కేసులు నమోదయ్యాయని ఢిల్లీ ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు సంఖ్య 13,418కి చేరుకుంది. మరోవైపు మృతుల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 30 మంది కరోనాతో మృతిచెందారని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు ఢిల్లీలో మొత్తం 261 మంది చనిపోయారు.
ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,540కు చేరుకుంది. 6,617 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కరోనాతో ఢిల్లీ ఎయిమ్స్‌లో పనిచేసే సీనియర్ డాక్టర్ జితేంద్ర నాథ్ పాండే(78) మృతిచెందడం కలకలం రేపింది. ఎయిమ్స్ క్యాంటీన్‌లో పనిచేస్తున్న ఓ మెస్ వర్కర్ మృతిచెందిన మరునాడే పాండే మృతిచెందారు. కాగా, ఢిల్లీలో ఇప్పటికే కరోనా రోగులకు వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రులలోని వైద్యులు, హెల్త్ వర్కర్లు కూడా కరోనాకు గురయ్యారు.