Delhi: Son's dog makes parent 'uneasy'; court orders couple to vacate parents' house
mictv telugu

కన్న కొడుకుపై గృహ హింస కేసు.. పెంపుడు కుక్కే కారణం

July 30, 2022

తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఇంట్లోకి కుక్కను తీసుకురావడమే కాకుండా, దానిని తల్లిపై దాడి చేసేందుకు ఉసిగొల్పాడు ఓ యువకుడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిందా తల్లి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఇంట్లో కుక్క ఉండడంతో తనకు, తన భర్తకు శ్వాసకోశ సమస్యలు ఎదురవుతున్నాయని ఆ కన్నతల్లి ఆరోపిస్తోంది. తమ కొడుకు ఇవేవీ పట్టించుకోకుండా పూజగదిలోకి, వంటగదిలోకి కుక్కను తీసుకురావడం ఇబ్బందిగా మారిందని ఆమె గృహ హింస చట్టం కింద పిటిషన్ దాఖలు చేసింది. దీంతో పాటు తన కుమారుడిని ఇంటి నుంచి బయటకు పంపించాలని వేడుకుంది.

విచారణ సందర్భంగా అదనపు సెషన్స్ జడ్జి అరుల్ వర్మ ఫిర్యాదుదారుని కుమారుడిని, అతని భార్యను వారం రోజులలోగా తల్లిదండ్రుల ఇంటిని ఖాళీ చేయాలని ఆదేశించారు. ఆ మహిళ, ఆమె భర్త వివిధ వ్యాధులతో బాధపడుతున్నారని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇంట్లో కుక్క ఉండడం వల్ల వారికి శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపింది. ఈ విషయంపై వ్యాఖ్యానించిన కోర్టు కొంతమంది జంతువుల ఉనికిని ఇష్టపడని వారు కూడా ఉంటారని పేర్కొంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆ యువకుడిని, అతని భార్యను ఇంటిని ఖాళీ చేయాలని కోర్టు ఆదేశించింది. వారు ఇంట్లోకి ప్రవేశించాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని కోర్టు పేర్కొంది.