హరిజన్ అనే పదం వాడకాన్ని అరికట్టడానికి ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆ నగరంలోని పలు కాలనీలు, వీధుల పేర్లలో ‘హరిజన్’ అనే పదాన్ని ‘డాక్టర్ అంబేద్కర్’తో మార్చడానికి నిర్ణయం తీసుకుంది. త్వరలో నోటిఫికేషన్ కూడా విడుదల చేయనుంది. దేశ రాజధానిలో వీధులు, కాలనీల పేర్లని ఇక నుంచి అంబేద్కర్ తో మార్చనున్నామని ఆ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ గురువారం తెలిపారు. అవమానకరంగా చెప్పుకునే ఈ పదాన్ని ఉపయోగించరాదని కోరుతూ అన్ని శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాలను జారీ చేయాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసిందని ఆయన చెప్పారు.
హరిజన్ అనే పేరుకు ప్రత్యామ్నాయంగా మరో పేరు కోసం తాము 2019 నుండి ఈ దిశలో పని చేస్తున్నామని గౌతమ్ అన్నారు. SC / ST / OBC సంక్షేమ శాఖ ఇది కించపరిచే పదమని.. షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తులు దీనిని ఇష్టపడరని స్పష్టం చేస్తూ.. పట్టణాభివృద్ధి శాఖకు లేఖ రాసిందని గౌతమ్ చెప్పారు. గతంలోనే పలు కాలనీలకు, వీధులకు అంబేద్కర్ పేరుతో మార్చుదామని నిర్ణయించగా… COVID-19 మహమ్మారి కారణంగా ప్రక్రియ ఆలస్యమైందని చెప్పారు. ఇప్పుడు ఈ ప్రక్రియను 10 రోజుల్లో పూర్తి చేయాలని న్యాయశాఖ అధికారులను ఆదేశించామని.. ఆ తర్వాత నోటిఫికేషన్ జారీ చేస్తామని మంత్రి తెలిపారు.