‘సారే జహాసే అచ్చా’ కవి పాఠాన్ని తొలగించిన ఢిల్లీ యూనివర్సిటీ
మహమ్మద్ ఇక్బాల్.. ఈ పేరు గురించి పూర్తి విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు. కానీ, ‘సారె జహాసే అచ్చా హిందూస్థాన్ హమారా’ అనే పాట రాసిన కవి అంటే గుర్తుపట్టని వాళ్లు ఉండరు. ఇప్పటికీ ఈ దేశభక్తి గీతాన్ని మనం పాడుకుంటూనే ఉన్నాం. ఈ పాట రాసిన కవి మహమ్మద్ ఇక్బాల్.. పాకిస్తాన్ జాతీయ కవి. అయితే, ఈ పేరు ఇప్పుడు చర్చల్లోకి వచ్చింది. ఢిల్లీ యూనివర్సిటీ ఆయనపై ఉన్న ఓ చాప్టర్ను సిలబస్ నుంచి తొలగించింది. వివరాల్లోకి వెళ్తే..
ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ ఆరో సెమిస్టర్ పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్లో మహమ్మద్ ఇక్బాల్ గురించి ‘మోడ్రన్ ఇండియన్ పొలిటికల్ థాట్’ అనే చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ను పాఠ్య పుస్తకం నుంచి తొలగించాలని అకడమిక్ కౌన్సిల్ నిర్ణయించి.. తీర్మానం పాస్ చేసింది. ఈ తీర్మానాన్ని ఢిల్లీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ యోగేశ్ సింగ్ ప్రవేశపెట్టగా.. సభ్యులంతా ఆ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ నిర్ణయాన్ని జాతీయ ఏబీవీపీ కమిటీ కూడా స్వాగతించింది.
పాకిస్తాన్ తత్వవేత్తగా మంచి గుర్తింపు ఉన్న ఇక్బాల్.. భారత్ నుంచి పాకిస్తాన్ను వేరుచేసి.. స్వతంత్ర దేశంగా ప్రకటించాలని ఐడియా ఇచ్చారు. ముస్లిం లీగ్లో జిన్నాను కీలక నాయకుడిగా తీర్చిదిద్దడంలో ఇక్బాల్ ముఖ్య పాత్ర పోషించారు. దేశాలు విడిపోవడంలో జిన్నాకు ఎంత బాధ్యత ఉందో.. అంతే బాధ్యత ఇక్బాల్కు కూడా ఉంది. ఆ కారణంతో ఇండియా పాఠ్య పుస్తకాల్లో మహమ్మద్ ఇక్బాల్ పేరును తొలగించాలని యూనివర్సిటీ నిర్ణయించింది. దీనిపై తుది నిర్ణయాన్ని జూన్ 9న ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీసుకుంటుంది.