హైదరాబాద్ వరదలు... ఢిల్లీ సర్కార్ భారీ విరాళం - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ వరదలు… ఢిల్లీ సర్కార్ భారీ విరాళం

October 20, 2020

Telangana

హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లక్షల్లో జనాలు నిరాశ్రయులు అయ్యారు. ఇప్పటివరకు వరదల కారణంగా 30 మంది మరణించారని తెలుస్తోంది. వరద ప్రభావానికి గురైన ప్రతీ ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆర్థికసాయం మంగళవారం ఉదయం నుంచే ప్రారంభిస్తామని వెల్లడించారు. వర్షాలు, వరదల వల్ల ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి లక్ష రూపాయల చొప్పున, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు రూ. 50 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించనున్నట్లు సీఎం ప్రకటించారు. అలాగే దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కోరారు. 

ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు, సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వానికి విరాళాలు ప్రకటిస్తున్నాయి. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ సీఎం సహాయనిధికి పది కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది. అలాగే తమిళనాడు ప్రభుత్వం కూడా పది కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తమ రాష్ట్రం తరుఫున రూ.15 కోట్ల సాయాన్ని ప్రకటించారు. కష్ట సమయంలో తెలంగాణ రాష్ట్రానికి ఢిల్లీ పూర్తిగా అండగా ఉంటుందని ఆయన ట్విట్టర్‌లో వెల్లడించారు. భారీ విరాళం ప్రకటించిన కేజ్రీవాల్‌కు తెలంగాణ ప్రజల తరుఫున సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.