Delhi woman gang raped by 5 men in Ghaziabad, 4 taken into custody
mictv telugu

దేశ రాజధానిలో మరో నిర్భయ ఘటన.. ఇనుప రాడ్‌తో..

October 19, 2022

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి నిర్భయ తరహా అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను కిడ్నాప్ చేసి కదులుతున్న వాహనంలోనే గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు ఐదుగురు వ్యక్తులు. రెండు రోజులపాటు తీవ్ర చిత్రహింసలకు గురి చేసి, ఆపై ఆమె ప్ర‌యివేటు పార్ట్స్ లో ఇనుప రాడ్ల‌ను చొప్పించారు. ర‌క్త‌పుమ‌డుగులో ప‌డివున్న మ‌హిళ‌ను చూసిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఆమెకు పరిచయం ఉన్న వ్యక్తులే దారుణానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు.

యూపీలోని ఘజియాబాద్‌కు ఓ ఫ్రెండ్ బర్త్ డే వేడుకలకు హాజరైంది బాధితురాలు. ఆ తర్వాత ఆమె సోదరుడు ఆమెను బస్టాండ్‌ వద్ద దింపారు. ఈ క్రమంలో బస్సు కోసం వేచి చూస్తుండగా.. కారులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు ఆమెను బలవంతంగా అందులోకి ఎక్కించారు. తర్వాత గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకువెళ్లి గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు. మానవత్వం మరిచి, రెండురోజుల పాటు దారుణంగా హింసించారు. ప్రైవేట్ పార్ట్స్ లో ఇనుప రాడ్డుతో దాడి చేశారు. అది ఇప్పటికీ ఆమె శరీరంలోనే ఉందని, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలీవాల్ ట్వీట్ చేశారు.

ఢిల్లీకి సమీపంలోని ఆశ్రమ్‌ రోడ్డులో రక్తపు మడుగులో పడిఉన్న బాధితురాలి గురించి మంగళవారం పోలీసులకు సమాచారం అందింది. ఆ వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకి సంబంధించి ఆ ఐదుగురిలో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘ప్రాథమికంగా తెలిసిన సమాచారం మేరకు బాధితురాలు, నిందితులకు మధ్య ఆస్తి తగాదాలున్నాయి. ఆ వివాదం కోర్టు పరిధిలో ఉంది. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకుంటాం’ అని గాజియాబాద్‌ పోలీసు ఉన్నతాధికారి ట్వీట్ చేశారు.