అక్కడ కార్పోరేట్ స్కూళ్లు కాదు..సర్కారీ బడులే సూపర్..! - MicTv.in - Telugu News
mictv telugu

అక్కడ కార్పోరేట్ స్కూళ్లు కాదు..సర్కారీ బడులే సూపర్..!

May 29, 2017

ప్రతీ ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. కాని ప్రభుత్వ స్కూల్లో చదువు మాత్రం వద్దు. ఊరు అవతల ఉన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎల్.కే.జీ సీటు కొనడం కోసం లక్షలు పోయడానికైనా రెడీ. కాని ఇంటి పక్కనే ఉన్న గవర్నమెంట్ స్కూల్ కు పిల్లలను పంపడానికి మాత్రం మనసు రాదు. లోపం మనలో ఉందా? లేక వ్యవస్థలో ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం వ్యవస్థలో ఉందనే చెప్పవచ్చు. టైం కు రాని ఉపాధ్యాయులు, భూత్ బంగ్లాలను యాద్ తెప్పించే భవనాలు, అరకొర సౌకర్యాలతో ప్రభుత్వ బడులంటేనే ప్రజలకు ఇకారం కలిగేలా చేసింది వ్యవస్థ. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ సిస్టంను మార్చేందుకు ఏ రాజకీయనాయకుడు సిన్సియర్ గా ప్రయత్నించలేదు. కాని ఒక్కడు మాత్రం ఈ దరిద్రపు వ్యవస్థను చీపురుతో సమూలంగా

ప్రక్షాళిస్తున్నాడు. అతడే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అతడి రాజకీయాలు ఎలా ఉన్నా విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు అతడు పడుతున్న తాపత్రయం, సాధిస్తున్న విజయాలు మొత్తం దేశాన్నే ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ మొన్నటి CBSE ఫలితాలు. వరుసగా రెండో ఏడాది కూడా ఢిల్లీలోని బడా కార్పోరేట్ స్కూల్స్ కంటే అక్కడి ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన ఫలితాలు సాధించాయి. ఢిల్లీ ప్రభుత్వ స్కూల్స్ 88.27% ఉత్తీర్ణత సాధిస్తే అక్కడి కార్పోరేట్ బడులకు 79.27% పాస్ పర్సంటేజ్ వచ్చింది. 112 గవర్నమెంట్ స్కూల్స్ వందకు వంద శాతం, 554 బడులు 90% ఉత్తీర్ణత సాధించాయి. ఒకటి,రెండు,మూడు అంటు “చై.నా” విద్యాసంస్థల ర్యాంకుల గోల వినీ వినీ విసిగిపోయిన మనల్నీ ఈ నెంబర్స్ పెద్దగా ఆకర్షించకపోవచ్చు. కాని ఒకప్పటి ఢిల్లీ స్కూల్స్ పనితీరు,వాటి రూపురేఖలు చూసిన వాళ్లు మాత్రం ఈ ఫలితాలతో ఆశ్చర్యపోతున్నారు. వరుసగా రెండో సారి కూడా గవర్నమెంట్ స్కూల్స్ అదరగొట్టడంతో రాజకీయాలకు అతీతంగా కేంద్ర మంత్రుల నుంచి ప్రతిపక్ష నేతల దాకా అందరూ అభినందిస్తున్నారు. తెల్లారి లేస్తే అరవింద్ కేజ్రీవాల్ పై ఒంటి కాలిపై లేచే మీడియా కూడా ఆమ్ ఆద్మీ సిఎంకు హ్యాట్సాఫ్ అంటుంది.

ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు సాధించిన ఈ ఘనతకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అంకుంఠిత దీక్షే కారణం. ఇదేదో రాత్రికి రాత్రి జరిగిన అద్భుతం కాదు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి అస్తవ్యస్తంగా ఉన్న ఢిల్లీ ప్రభుత్వ విద్యా వ్యవస్థను మార్చడానికి అరవింద్ కేజ్రీవాల్ అండ్ టీం పడుతున్న నిరంతర తపన. రేపటి పౌరుల కోసం నాణ్యమైన విద్యను అందించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రయత్నిస్తుందని అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే కేజ్రీవాల్ ప్రకటించారు. తమ ఆలోచనలే కాదు ఆచరణ కూడా అద్భుతంగా ఉంటాయని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే చేతల్లోనూ చేసి చూపించారు. తమ తొలి బడ్జెట్ [2015-16 ] 41,129 కోట్ల రూపాయల్లో 9,836 కోట్ల రూపాయలను విద్యారంగానికి కేటాయించారు. అప్పటిదాక ఢిల్లీని పాలించిన ప్రభుత్వాలు విద్య కోసం విదిల్చిన దానికి ఇది 106 శాతం ఎక్కువ. ఆ తర్వాతి బడ్జెట్ [2016-17] 47,600 కోట్ల రూపాయాల్లో 10,690 కోట్ల రూపాయలను విద్యారంగం కోసం ఆప్ సర్కార్ రిజర్వ్ చేసింది. ఇది మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో 22.9 శాతం. ఇక మొన్నటి మూడో బడ్జెట్ 48,000 కోట్ల రూపాయల్లో 11,300 కోట్ల రూపాయలను విద్య కోసమే సమకూర్చింది. మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో ఇది 24శాతం. ఈ నిధులతో కొత్తగా పది వేల క్లాస్ రూంలను, 400 లైబ్రరీలను ప్రారంభించబోతుంది. విద్యార్థుల ప్రగతిని నిరంతరం పర్యవేక్షించడానికి టీచర్లకు ట్యాబ్ లను ఇస్తుంది. వీటితో పాటు పైలట్ ప్రాజెక్ట్ కింద పది ప్లే స్కూల్స్ ను ప్రారంభించడంతో పాటు 156 పాఠశాలల్లో కొత్తగా నర్సరీ తరగతులను మొదలుపెడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పాఠశాలలన్నింటిలోను అత్యాధునిక సౌకర్యాలను కేజ్రీవాల్ సర్కార్ కల్పించింది. క్లాస్ రూంలను డిజిటలీకరించింది. ప్లేవే మెథడ్ లో ప్రైమరీ స్కూల్స్ లో విద్యాబోధనను షురూ చేసింది. ఢిల్లీలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఏసీ సౌకర్యం కూడా కల్పించింది.

కోట్లాది రూపాయల నిధులను కేటాయించి సక్రమంగా వాటిని ఖర్చు చేయడమే కాదు ఉపాధ్యాయులు ఆలోచనా విధానంలోనూ మార్పు తీసుకొచ్చింది ఢిల్లీ సర్కార్. ప్రస్తుత పోటీ ప్రపంచంతో విద్యార్థులు పోటీ పడాలంటే ముందుగాల ఉపాధ్యాయులు అప్ టూ డేట్ గా ఉండాలనుకుంది. అందుకే వారిలో నైపుణ్యానికి మరింత పదును పెట్టేందుకు అత్యుత్తమ శిక్షణను ఇప్పించింది. ఇందుకోసం దాదాపు 100 కోట్లు కేటాయించింది. దీంతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతాలను భారీగా పెంచింది. ప్రస్తుతం 21 వేల రూపాయలుగా ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ జీతాన్ని 34 వేలు చేసింది. 18 వేల రూపాయలున్న TGT జీతాన్ని 33 వేలకు, 16 వేల రూపాయలున్న అసిస్టెంట్ టీచర్ జీతాన్ని 32 వేలకు పెంచింది. అడగకుండానే అన్నీ ఇచ్చిన ఆప్ సర్కార్, ప్రతీ శుక్రవారం టీచర్లంతా ఒక గంట అదనంగా పనిచేయాలని కోరింది. ఆ సమయంలో స్కూల్ అడ్మినిస్ట్రేషన్, అకాడమిక్ వ్యవహారాలపై మరింత దృష్టి పెట్టాలని కోరింది.

ప్రభుత్వ విద్యా వ్యవస్థలో కేజ్రీవాల్ సర్కార్ తీసుకొచ్చిన మరో విప్లవాత్మక మార్పు ఏంటంటే సమాజానికి ఏదో ఒక మంచి చేయాలన్న ఆలోచన ఉన్న బాగా చదువుకున్న వాళ్లను ప్రభుత్వ స్కూల్స్ లో పాఠాలు చెప్పేందుకు ఆహ్వానించింది. ఈ నిర్ణయం సత్ఫలితాలను ఇచ్చింది. ఐఐటీ గ్రాడ్యుయేట్స్ తో పాటు ఎంతోమంది విద్యావంతులు వారంలో కొన్ని రోజులు విద్యార్థులకు ఉచితంగా పాఠాలు చెపుతున్నారు. టెక్ట్స్ బుక్స్ లోని పాఠాలతో పాటు వాళ్ల జీవిత పాఠాలనూ తెలుసుకుని అక్కడి విద్యార్థులు రాటుదేలుతున్నారు.

సర్కారీ స్కూళ్లలో కూడా ప్రైవేటు బడుల్లో ఉన్నట్టే ఇంగ్లీష్ మీడియం, సమర్థులైన ఉపాధ్యాయులతో పాటు ఆధునిక సౌకర్యాలుంటే ఎవ్వరు కూడా కార్పోరేట్ స్కూల్స్ గురించి ఆలోచించరు అనడానికి ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు మంచి ఉదాహరణ. ఇంతేకాదు కేవలం ఓట్ల కోణంలో నుంచి మాత్రమే ఆలోచిస్తే విద్యారంగం అస్సలు బాగుపడదు. ఈ సత్యాన్ని తెలుసుకున్న రోజు మన సర్కారీ బడులు కూడా ఢిల్లీ స్కూల్స్ లా మారుతాయి. దేశంలోని ప్రతీ రాష్ట్రంలోనూ ఆరోజు త్వరగా రావాలని మైక్ టీవీ కోరుకుంటుంది.