దేశ రాజధాని ఢిల్లీలో శాంతిభద్రతల సమస్య ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న దారుణ ఘటనలే ఇందుకు నిదర్శనం. తాజాగా ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ స్వాతి మాలివాల్కి భయానక అనుభవం ఎదురైంది. గురువారం తెల్లవారుజామున ఓ వ్యక్తి రోడ్డుపై నిల్చున్న స్వాతిమాలివాల్ని కారులో 15 మీటర్లు ఈడ్చుకెళ్లాడు. అనంతరం ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు హరీష్ చంద్ర (47)ని అరెస్ట్ చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. స్వాతి తెలిపిన కథనం ప్రకారం ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ‘మహిళల భద్రతపై క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకోవడానికి తెల్లవారు జామున 3 గంటలకు ఓ బస్టాప్‌లో నిల్చున్నాను. ఆ సమయంలో కారుతో వచ్చిన ఓ వ్యక్తి కారెక్కమని ఒత్తిడి చేశాడు.
నేను నిరాకరించడంతో ముందుకెళ్లి యూటర్న్ తీసుకొని మళ్లీ వేధించాడు. దీంతో నేను పట్టుకునేందుకు ప్రయత్నించగా, ఇంతలో కారు అద్దం పైకి లేపి నా చేయి ఇరుక్కునేలా చేశాడు. అలా 15 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. ఆ సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడు. అదృష్టవశాత్తూ ఏ ప్రమాదం జరగకుండా దేవుడే నన్ను కాపాడాడు. మహిళా చైర్ పర్సన్ పరిస్థితే ఇలా ఉందంటే రాజధానిలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఊహించుకోండి’ అంటూ ఫిర్యాదుతో పాటు ట్విట్టర్ లో వెల్లడించారు.