స్వచ్ఛమైన గాలి కావాలా.. ‘ఆక్సీజన్ బార్‌’కు వెళ్లాల్సిందే..  - MicTv.in - Telugu News
mictv telugu

స్వచ్ఛమైన గాలి కావాలా.. ‘ఆక్సీజన్ బార్‌’కు వెళ్లాల్సిందే.. 

November 26, 2019

Delhi’s first-ever oxygen bar gives you fresh air to breathe

మన ఏమరుపాటుతో వాతావరణం ఎంత కాలుష్యం అవుతుందో తెలుసుకోలేనంత అజ్ఞానంలో ఉన్నాం. ‘ఆ ఏమవుతుందిలే.. వచ్చినప్పుడు చూసుకుందాంలే’ అనుకునేవారు ఎక్కువయ్యారా? మన అజాగ్రత్తో గాలి, నీరు, తినే తిండి ఇలా భూమ్మీద ఉన్న పంచభూతాలు కాలుష్యానికి గురి అవుతున్నాయి. నగరాల్లో ముఖ్యంగా వాహనాల సంఖ్య మనుషుల కన్నా ఎక్కువ అవుతోంది. వాటి పొగతో గాలి ఎంత కలుషితం అవుతుందో గ్రహించలేకపోతున్నాం. ప్లాస్టిక్ వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదేమో. వీటితో రానురాను మనం పీల్చడానికి ఆక్సీజన్ కూడా కరువు అవుతుంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో అది కనిపిస్తోంది. కాలుష్యపు పొగలు నగరాన్ని ఎలా కమ్ముకుంటున్నాయో తెలిసిందే. ఒకప్పుడు నీళ్లు అమ్ముతారు అని కాలజ్ఞానంలో చదువుకున్నప్పుడు అవునా.. అని నవ్వుకున్నాం. ఇప్పుడు గాలి కూడా అమ్ముతారు, మనం కొంటాం అంటే నమ్మం కదా. కానీ నమ్మాల్సిందే. రేపు దేశంలోని అన్నీ నగరాల్లో ఆక్సీజన్ అమ్మకాలు జోరు అందుకుంటాయి. 

ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీలో ఆక్సీజన్ బార్ తెరుచుకుంది కాబట్టి. స్వచ్ఛమైన గాలి పీల్చాలనుకునేవారు ఆ బార్‌కు వెళ్లి పదిహేను నిముషాలకు కేవలం రూ. 300లు చెల్లిస్తే చాలు. ఊపిరితిత్తుల నిండా ఆక్సీజన్ గాలి పీల్చి రావచ్చు. త్వరలో మిగిలిన నగరాలు, ఆ తరువాత పల్లెలూ, ఆ తరువాత అటవీ ప్రాంతాల్లోకి కూడా ఈ వెసలుబాటు అందుబాటులోకి రానుంది. ప్లాస్టిక్ వాడకం, చెత్తను తగలేయడం, పొలాల్లో మిగిలిన గడ్డికి మంట పెట్టడం, ప్రతి చిన్న అవసరానికి వాహనాలు వాడటం, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడకపోవడాన్ని గొప్పగా ఫీలవడం, ఇలా చెప్పుకుంటూ పోతే మనం చేసే ప్రతీ చర్య పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నాయి. భూమి మొత్తాన్ని చెత్త కుప్పలా చేస్తున్నాం. 

ఇలాంటి పనులకు కులం రంగును పులిమి పోటాపోటీగా ఇంకా కాలుష్యాన్ని పెంపొందించే పనే చేస్తున్నాం తప్పితే తగ్గడంలేదు ఎవరు. ఇది ఇలాగే కొనసాగితే గ్రామాల్లో కూడా కాలుష్యం తిష్ఠ వేయక తప్పదు. అప్పుడు గ్రామాల్లో కూడా ఇలాంటి ఆక్సీజన్ బార్లు తెరుచుకోవడం ఖాయం. కొందరు దీనిని కూడా మన అభివృద్ధిలో భాగం అనుకోవచ్చు. అక్కడే మనం చాలా పెద్ద పొరపాటు చేస్తున్నాం. అభివృద్ధి వెంట పరుగెడుతూ ఇదిగో ఇలా భవిష్యత్తుకు ఆక్సీజన్ బార్లను కానుకలుగా ఇస్తున్నామేమో ఆలోచించండి.