ఫుడ్ డెలివరీ బాయ్స్ హడావుడి గురించి చెప్పాల్సిన పని లేదు. డెలివరీలు ఆలస్యం అవుతాయని కొందరు, ఎక్కువ డెలివరీలు చేయాలని కొందరు పార్సిళ్లను టకటకా పడేసి పోతుంటారు. స్వీడన్లో అలాంటి ఓ డెలివరీ డ్రైవర్ చేసిన పనేమిటో తెలిస్తే షాక్ తింటారు. బేబీ వీల్‌చెయిర్‌లో నిద్రపోతున్న ఓ పసిబిడ్డపై అతడు ఏకంగా 10 కేజీల బరువు ఉన్న కూరగాయల డబ్బాను పెట్టిపోయాడు. ఆ బిడ్డతల్లి కాస్త దగ్గర్లోనే ఉండడంతో పరుగుపరుగున వచ్చి డబ్బాను తీసేయడంతో చిన్నారికి ప్రాణాపాయం తప్పింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాతో పంచుకుంది.
స్వీడన్లో చిన్నపిల్లలను పెరట్లో నిద్రపుచ్చే అలవాటు ఉంది. అలా అయితే పిల్లలు బలంగా పెరుగుతారని నమ్మకం. ఆమె కూడా తన చిన్నారిని బండిలో ఉంచి నిద్రపుచ్చి తోటలో ఏదో పనిచేసుకుంటోంది. హలో ఫ్రెష్ ఫుడ్ కంపెనీకి చెందిన డెలివరీ డ్రైవర్ పార్సిల్ తీసుకొచ్చి బండిపై ఉంచాడు. పొడి ప్రదేశంలో పార్సిల్‌ను ఉంచాలని కంపెనీ చెప్పడంతో అలా చేశాడు. తల్లి ఆ విషయం గమనించి డబ్బాను తీసేసి బిడ్డను కాపాడుకుంది. కంపెనీకి ఫిర్యాదు కూడా చేసింది. కంపెనీ క్షమాపణ కోరి స్వల్ప మొత్తాన్ని పరిహారంగా చెల్లించింది. డెలివరీ బాయ్ కూడా తప్పు చేశానని కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పాడు. ఇంకోసారి అలా చేయొద్దని ఆమె మందలించి పంపేసింది.