మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించడం అనైతికం, రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాషాయ పార్టీ ఉద్దేశపూర్వకంగానే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచాలని చూస్తోందన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. “ప్రజాస్వామ్యాన్ని కూల్చివేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. భారత్లో ప్రజాస్వామ్యం పనిచేస్తోందా? అన్న సందేహం తనకు కలుగుతోందన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని వారు కూల్చివేస్తే కనుక ప్రజలకు, ఉద్ధవ్ థాకరేకు న్యాయం జరగాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. మహారాష్ట్ర తర్వాత కూడా బీజేపీ ఆగదని, ఇతర ప్రభుత్వాలను కూడా కూల్చివేస్తుందని” మమతా ఆరోపించారు.