బ్లాక్ మనీకి అడ్డుకట్ట వేయాలన్న పేరుతో నవంబర్ 8, 2016న మోదీ సర్కార్ అకస్మాత్తుగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.1000, రూ.500 నోట్ల రద్దుతో రాత్రికి రాత్రే చలామణిలోని రూ.10 లక్షల కోట్ల విలువైన కరెన్సీ తుడిచిపెట్టుకుపోయింది. బ్లాక్ మనీ అడ్డుకట్ట పడిందో లేదో తెలియదు కానీ.. సామాన్యుడు మాత్రం ఆనాడు చాలా ఇబ్బందులు పడ్డాడు. కేంద్రం చర్యను తప్పబడుతూ పలు సామాజిక వేత్తలు మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నాడు తీసుకున్న నిర్ణయాన్ని తాజాగా అయిదుగురు సభ్యుల ధర్మాసనం 4-1 తేడాతో సమర్థించింది. నోట్ల రద్దు అంశాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ఆ పిటిషన్లను కొట్టిపారేసింది. అయితే ధర్మాసనంలోని జస్టిస్ నాగరత్న మాత్రం నోట్ల రద్దు అంశాన్ని తప్పుపట్టారు. ఆ చర్య చట్టవ్యతిరేకంగా సాగినట్లు ఆమె తెలిపారు. నోట్ల రద్దు చర్య కేంద్రం చేపట్టాల్సింది కాదని ఆమె అన్నారు.
ఈ రోజు వెలువరించిన తీర్పులో పిటిషన్లు దాఖలు చేసినవారితో ఏకీభవిస్తున్నట్లు ఆమె తెలిపారు. 2016, నవంబర్ 8న, కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ చట్టవ్యతిరేకమన్నారు. ఆర్బీఐలోని సెక్షన్ 26 ప్రకారం.. ఆ సంస్థ వ్యక్తిగతంగా నోట్ల రద్దు సిఫారసు చేసి ఉండాల్సిందన్నారు. ప్రభుత్వం సలహా ఇచ్చినంత మాత్రాన డిమానిటైజేషన్ చేయడం సరికాదన్నారు. తన అభిప్రాయం ప్రకారం… డిమానిటైజేషన్ నోటిఫికేషన్ చట్టవ్యతిరేకమని, కానీ ఆనాటి సంఘటనను ఇప్పుడు నిలుపుదల చేయలేమని తెలిపారు. నోట్ల రద్దు అంశం చట్టం పరిధిలో జరగలేదని, అది అధికారంతో జరగిందని, అందుకే దాన్ని చట్టవ్యతిరేక నిర్ణయమని అభిప్రాయపడుతున్నట్లు ఆమె వెల్లడించారు.. పార్లమెంట్ ద్వారా నోట్ల రద్దు ప్రక్రియను చేపడితే బాగుండేదని, కానీ ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ సరిగా లేదన్నారు. కేంద్ర ప్రోద్భలంతోనే ఆ చర్య చేపట్టారని, కానీ ఆర్బీఐ వ్యక్తిగత స్వేచ్ఛ ద్వారా జరిగినట్లు లేదన్నారు.