Demonetization what it achieved in past eight years
mictv telugu

నోట్లరద్దుకు 6 ఏళ్లు.. ఏం సాధించినట్టు?

November 8, 2022

అవినీతిపై ఉక్కుపాదం మోపడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి ఈ రోజుకు సరిగ్గా ఆరేళ్లు. 2016 నవంబర్ 8వ తేదీ రాత్రి మోదీ ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. చిల్లర నోట్లు దొరక్క వందల మంది బ్యాంకు క్యూల్లో నిలబడి అసువులు బాశారు. రూ.500, రూ.1000 రద్దు చేస్తున్నామని ప్రకటించిన మోదీ ముందు జాగ్రత్తలు తీసుకోకుండానే హడావుడిగా ప్రకటన చేయడం ప్రజల కొంప ముంచింది. రద్దయిన నోట్ల స్థానంలో కొత్త రూ. 500, రూ. 2000 నోట్లు తీసుకొచ్చారు. రూ.200 నోట్లు, కొత్త 50 కోట్ల, కొత్త 100నోట్లు కూడా వచ్చేసి చేతుల్లో రంగురంగులు చూపాయి. మరి ఈ ఎనిమిదేళ్లలో నోట్ల రద్దుతో సాధించాలనుకున్న లక్ష్యాలు ఏమాత్రం నెరవేరాయి? రోగమొకటైతే మందు ఒకటి వేశారన్న విమర్శ సబబేనా?

అనుకొన్నదొక్కటి, అయినదొక్కటి..
అవినీతి నిరోధం, ఉగ్రవాద నిధులకు అడ్డుకట్ట, నకిలీ కరెన్సీ నిరోధం, ప్రజా సంక్షేమం వంటి మహత్తర లక్షాల కోసం పెద్ద నోట్లు రద్దు చేశామని ఆనాడు చెప్పారు. ఈ ఆరేళ్ల కాలంలో వీటిలో ఉగ్రవాద నిధులకు అడ్డకట్ట లక్ష్యం అరకొరగా తప్ప మరే లక్ష్యాలూ నెరవేరలేదు. అవినీతి మరింత విజృంభించి. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వోద్యోగుల, కార్పొరేట్ సంస్థల అవినీతికి లక్షల కోట్లలోనే ఉంది. ఎక్కడ, ఏ అవినీతి కేసులో దొరికినా అన్నీ పెద్ద నోట్ల కట్టలే బయటపడుతున్నాయి. రెండువేల నోట్లు మూడు నాలుగేళ్ల కిందటే బహిరంగ చలామణి నుంచి తప్పుకున్నాయి. అవినీతిపరులు వాటిని భద్రంగా దాచేసుకుని ఆస్తు కొనుగోళ్లకు, లంచాలకు, ఎన్నికల్లో ఓటర్లకు పంచడానికి వాడుతున్నారు. బ్యాంకుల సహకారం, పైస్థాయి నేతల అండదండలతో నల్ల డబ్బు తెల్లగా మారిన దాఖలాలెన్నో ఉన్నాయి.

కొంచెం బెటర్..
నోట్ల రద్దుతో జనానికి మేలేం జరక్కపోయినా ప్రభుత్వానికి కొన్ని సమస్యలు తీరాయి. ఐటీ రిటర్నులు పెరిగాయి. ఉగ్రవాద నిధులకు అడ్డుకట్ట పడింది. డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. అయితే అత్యంత కీలకమైన అవినీతి మాత్రం మరింత పెరిగింది.

రూటు మారిన అవినీతి
నోట్ల రద్దుతో అవినీతిపరులు రూటు మార్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. లైసెన్సుల కోసం లంచాలు, సహజ వనరుల అక్రమ కేటాయింపులు, దందాలు వంటి ‘సంప్రదాయ అవినీతి’ మార్గాల్లో కాకుండా సృజనాత్మక మార్గాల్లో ఆమ్యామ్యా అంటున్నారు. బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకుని ఆనక నష్టాల్లో ఉన్నామంటూ తిరిగి చెల్లించకుండా చేతులెత్తున్నారు. ప్రభుత్వాల అండదండంతో వేల, లక్షల కోట్ల రుణాలు మాఫీ అవుతున్నాయి. ఆ సొమ్మంతా ప్రజలు కష్టపడి బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మే. ఆ నష్టాన్ని భరీ చేయడానికి ప్రభుత్వం ప్రజల నుంచి గోళ్లూడగొట్టి పన్నులు వసూలు చేస్తోంది. ఆదాయం పెంచుకోడానికి, దేశమంతా ఒకే పన్ను పేరుతో తీసుకొచ్చిన జీఎస్టీ ప్రజల నడ్డి విరుస్తోంది. రోజువారీ వాడే వస్తువులపై 18 శాతం పన్ను బ్రిటిష్ వారి హయాంలోనూ లేదన్నది పచ్చినిజం. ఒకరకంగా ఇది ప్రభుత్వం చట్టబద్ధంగా చేస్తున్న అవినీతే అన్నది నిపుణుల అంచనా. పెరుగుతున్న చమురు ధరలు, 2016తో పోలిస్తే రెండు మూడింతలైన నిత్యావసరాల ధరలను ఒకసారి పరిశీలిస్తే నోట్ల రద్దులోని డొల్లతనం అర్థమవుతుంది. అవినీతి సర్వాంతర్యామి అని, అది కేవలం పెద్ద నోట్ల రూపంలో ఉంటుందనుకోవడం భ్రమ అని రోజురోజుకూ పెరుగుతున్న రాజకీయ నాయకుల, వ్యాపారుల ఆస్తులు, ప్రజల దరిద్రం చెబుతున్నారు.