Demonic Close-up of Ant's Face Is Straight Out of a Horror Movie
mictv telugu

‘ఎవరన్నారు? డ్రాగన్లు మాయమైపోయాయని.. ఇలా అయ్యాయి’

October 28, 2022

రోజూవారీ జీవితంలో మనం ఏదో ఒక చోట చీమలను చూస్తూనే ఉంటాం. చటుక్కున కుడితే ఒక్క దెబ్బ వేసి వాటి ప్రాణాలు తీసేస్తాం. అంతే కదా చీమంటే అంత అలుసు మనకి.. కుట్టిన పాపానికి దానిని నలిపేయకుండా ఉండలేం. అత్యంత చిన్న సైజులో ఉండే చీమలు.. పెద్ద ఆకారంలో ఉంటే ఎలా ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించామా? వాటిని క్లోజప్‌లో చూస్తే ఎలా ఉంటుందో చూశారా?

లిథువేనియాకు చెందిన యూజెనీయస్ కవలియాస్కాస్ అనే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌కు ఈ ఆలోచన వచ్చింది. వెంటనే మైక్రోస్కోప్ ముందు ఒక చీమను పెట్టి దాని క్లోజప్ ఫొటో తీశాడు. దాన్ని ‘2022 నికాన్ స్మాల్ వరల్డ్ ఫోటోమైక్రోగ్రఫీ కాంపిటీషన్‌’కు పంపాడు. ఈ ఫొటోకు ప్రైజ్ రాలేదు కానీ.. ఇది చూసిన నెటిజన్లు దడుసుకొని చస్తున్నారు.

 

ఆ చీమ గ్రహాంతర వాసిలా కనిపిస్తోంది. పదునైన దంతాలు, కళ్లపై యాంటెన్నాలు, ముక్కు కూడా చాలా రద్దీగా,ఒక గడ్డం లాంటి భాగం కనిపిస్తుంది. ఇది చూసిన వాళ్లంతా చీమ ఇంత భయంకరంగా ఉందేంటి? అని ప్రశ్నిస్తున్నారు. రెబెక్కా మెక్‌కెండ్రీ అనే మహిళ కూడా ఈ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసింది ఇది చూసిన ఒక నెటిజన్ ‘డ్రాగన్లు మాయమైపోయాయని ఎవరన్నారు? అవి ఇలా చిన్నగా అయిపోయాయంతే’ అని కామెంట్ చేయగా.. ‘ఇదేదో భయంకరమైన హారర్ సినిమాలో సీన్‌లా ఉంది’అని మరొకరు అన్నారు. ‘ఇవి చీమలు కాబట్టి సరిపోయింది. అదే భారీ సైజులో ఉండే జెయింట్స్ అయితే మన పరిస్థితి ఏంటి?’ అని ఒకరు ప్రశ్నించారు. దీనికి 1 లక్షకు పైగా లైక్‌లు, వేలాది రీట్వీట్లు వచ్చాయి.