mictv telugu

మోదీ అలోచన.. రూ. 11, రూ. 21 నోట్లు!

January 7, 2019

బంధువులు, స్నేహితుల ఇళ్ళల్లో పెళ్లిళ్లు జరిగినప్పుడు బహుమతికి బదులు కొందరు చదివింపుల పేరుతో నగదు బహుమతిని ఇస్తుంటారు. ఓ కవర్‌లో రూ. 11 లు, రూ. 21లు, రూ.116లు, రూ.1016.., ఇలా స్థాయిని బట్టి ఇస్తుంటారు. మనవైపు 116, 1116 ఇస్తుంటారు.  రౌండ్ ఫిగర్‌గా ఇవ్వకుండా అందుకు ఒక రూపాయో, ఆరు రూపాయలో ఎక్కువగా చదివిస్తుంటారు. ఈ పద్ధతిని హిందూ సాంప్రదాయంలో షగుణ్ అని అంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ఈ షగుణ్ కోసం వింత నోట్లను ప్రవేశపెట్టాలనుకున్నారట ప్రధాని నరేంద్ర మోదీ.

modi

రెండేళ్ల క్రితటి పెద్ద నోట్ల రద్దును సామాన్యులు ఇప్పటికీ మర్చిపోవడం లేదు. రూ.1,000, రూ.500 నోట్లు రద్దు చేసి వాటి స్థానంలో రూ.2,000, రూ.500(కొత్తది), రూ.200 నోట్లను తెచ్చిన తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు కన్నా ముందే రూ.11, రూ.21 నోట్లు కూడా ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం భావించినట్టు ది ప్రింట్ పత్రిక తెలిపింది. ఈ ప్రతిపాదనపై ఆర్‌బీఐతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్చలు కూడా జరిగాయని కథనంలో పేర్కొంది.

ఈ చర్చల సమయంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆర్థిక శాఖ కార్యదర్శిగా రాజీవ్ మెహ్రుషి ఉన్నారు. ఇలాంటి నోట్లను ముద్రించడం వల్ల చలామణిలో అనేక సమస్యలు వస్తాయని ఆర్‌బీఐ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదని పేర్కొంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దుకు పూనుకున్న విషయం తెలిసిందే. ఒకవేళ ఆర్‌బీఐ కేంద్రం ప్రతిపాదనలకు ఒప్పుకొని ఉంటే ఇప్పుడు రూ.11, రూ.21 నోట్లు చలామణిలో ఉండేవి.