జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్‌పై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్ర విమర్శలు సంధించారు. ఆకు రౌడీ, వీధి రౌడీ అంటూ తనపై పవన్ చేసిన విమర్శలు నేలబారుగా ఉన్నాయని మండిపడ్డారు. తాను పవన్ వ్యక్తిగత జీవితంపై మాట్లాడితే అతడు మూడు రోజులు అన్నం తినలేడని హెచ్చరించారు.చింతమనేని గురువారం విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ‘నాపై కేసులు వీగిపోయాయి. కానీ పవన్ నన్ను ఆకు రౌడీ’, వీధి రౌడీ’ అంటున్నాడు.. ఈ టైటిల్స్ సినిమాలకు పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందేమో ఆలోచించు… కనీసం విప్‌కు.. చీఫ్ విప్‌కు నీకు తేడా తెలియదు. నాకు చంద్రబాబు ఇచ్చింది విప్.. నువ్వేమో చీఫ్ విప్ అంటున్నావు.. అసలేం నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా?’ అని మండిపడ్డారు.
పవన్ తన గురించి పూర్తిగా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు. ‘నువ్వు.. నన్ను నాణేనికి ఒక వైపే చూశావు… రెండో వైపు కూడా చూడు. అలా చూస్తే తట్టుకోలేవు. నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి ఏంటో చూసి మాట్లాడు’ అని అన్నారు. తన కేసులపై పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని దుయ్యబట్టారు. ‘నాపై 27 కేసులు ఉన్నాయని ఒకసారి అంటావు.. మరోసారి 37 కేసులు అని అంటావు. ఎవడో రాసిస్తే చదవడం కాదు, నా గురించి తెలుసుకుని మరీ మాట్లాడు’ అని అన్నారు.