గుంటూరులో డెంగీ పంజా.. బలైన డాక్టర్..  - MicTv.in - Telugu News
mictv telugu

గుంటూరులో డెంగీ పంజా.. బలైన డాక్టర్.. 

September 22, 2019

డెంగీ జ్వరాలతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలను కాపాడాల్సిన వైద్యుడే డెంగీతో మృతిచెందడం వైద్యవర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. సీనియర్‌ యూరాలజిస్ట్‌ డాక్టర్‌ అలపర్తి లక్ష్మయ్య డెంగీ జ్వరంతో శనివారం మృతి చెందారు. అలపర్తి లక్ష్మయ్య నగరంపాలెంలో నందన హాస్పిటల్‌ పేరిట వైద్యశాలను నిర్వహిస్తున్నారు. ఆయనకు నాలుగు రోజుల క్రితం జ్వరం వచ్చింది. దీంతో ఆయన అరండల్‌పేటలోని ప్రైవేటు వైద్యశాలలో చేరారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేసి ఆయనకు డెంగీ జ్వరం సోకిందని నిర్ధారణ చేశారు. అందుకుతగ్గ చికిత్స తీసుకుంటున్నారు. 

ఈ క్రమంలో రెండు రోజుల కిందట ఆయన పరిస్థితి విషమించింది. దీంతో ఆయనను విజయవాడ సమీపంలోని మణిపాల్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతిచెందారు. దీంతో వెంటనే వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు రంగంలోకి దిగి డీఎంహెచ్‌వో ఇంటి పరిసరాల్లో ఫాగింగ్‌, దోమల లార్వా నియంత్రణ చర్యలు చేపట్టారు. లక్ష్మయ్య నివసించే బృందావన్‌ గార్డెన్స్‌ పరిసర ప్రాంతాల్లో కూడా ఫాగింగ్‌, ఫీవర్‌ సర్వే చేపట్టారు. కాగా, గుంటూరులో మరో ఇద్దరు వైద్యులు, ఒక వైద్య విద్యార్థి కూడా డెంగీతో బాధపడుతున్నారు. వీరిలో ఒక డాక్టర్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్సలు అందిస్తున్నట్లు సమాచారం. 

ఇదిలావుండగా డెంగీ రోగులను ఐసీయూలో ఉంచి చికిత్సలు చేస్తున్న సమయంలో డాక్టర్లు జాగ్రత్తులు పాటించడంలేదు. ఆయా రోగులను దోమ తెరల మధ్య ఉంచాలి. దీనివల్ల ఆ రోగుల నుంచి డెంగీ డాక్టర్లకు వ్యాపించదు. కానీ, చాలా మంది వైద్యులు డెంగీ రోగులకు కూడా సాధారణ రోగుల్లానే చికిత్సలు చేస్తున్నారు. దీనివల్ల వైద్యులు, సిబ్బంది డెంగీ బారిన పడుతున్నారని ఆరోగ్యశాఖ వర్గాలు వాపోతున్నాయి.