పాప చచ్చిపోయింది.. 18 లక్షల బిల్లు కట్టమన్నారు.. - MicTv.in - Telugu News
mictv telugu

పాప చచ్చిపోయింది.. 18 లక్షల బిల్లు కట్టమన్నారు..

November 21, 2017

రోజురోజుకూ డాక్టర్లు, కార్పోరేట్ ఆసుపత్రుల దోపిడీ ఆగటం లేదు. డెంగీ జ్వరంతో చేరిన చిన్నారికి వైద్యానికి రూ. 18 లక్షల బిల్లు వేశారు. ఇంత బిల్లా ? అని ఆశ్చర్యపోయారు పాప తల్లిదండ్రులు. వాళ్ళు చెప్పినన్ని డబ్బులు చెల్లిద్దామన్నా పాపం వాళ్ళ పాప బతకలేదు. ‘ మా వంతు ప్రయత్నం మేము ముమ్మరంగా చేశాం. పాప బతకకపోతే మాదెలా బాధ్యత అవుతుందన్నట్టు ’ బుకాయించారు. బిల్లు కట్టే వరకు పాప శవాన్ని కదలనిచ్చేది లేదని దానవుల్లా భీష్మించుక్కూర్చున్నారు. గురుగ్రామ్‌లోని ప్రముఖ ఫోర్టీస్‌ హాస్పిటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఢిల్లీలోని  ద్వారక ప్రాంతానికి చెందిన జయంత్‌ సింగ్‌ ఏడేళ్ల కుమార్తె ఆద్య సింగ్‌ ఆగస్టులో డెంగీకి గురైంది. ఆగస్ట్ 31 న పాపను ఫోర్టీస్ ఆసుపత్రిలో చేర్చాడు. పదిహేను రోజుల పాటు చికిత్స అందించిన డాక్టర్లు పాప ప్రాణాలు కాపాడలేకపోయారు. చికిత్స పొందుతూ సెప్టెంబర్ 14న ఆద్య మృతి చెందింది. పాప వైద్యానికి అయిన ఖర్చు రూ. 18 లక్షలు వేశారు. వైద్యానికి వాడిన సిరంజీలు, మందులూ మాకులు, రకరకాల టెస్టులు, బెడ్డు ఛార్జీలు సహా వైద్యులు వాడి పారేసిన 2700 గ్లౌజులకు కూడా చాంతాండంత బిల్లు వేశారు. ఇంత బిల్లు వేసినా పాప ప్రాణమైనా దక్కిందా అంటే అదీ లేదు. పైగా డబ్బు కడితేనే చిన్నారి మృతదేహాన్ని అప్పగిస్తామన్నారు. దీంతో చేసేదేమీ లేక జయంత్‌ సింగ్‌ రూ. 18 లక్షలు కట్టాడు.

ఈ విషయాన్ని ఇటీవల జయంత్‌ స్నేహితుడు ఒకరు ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘మా స్నేహితుడి కుమార్తెకు ఫోర్టీస్‌ ఆసుపత్రిలో 15రోజుల పాటు రూ. 18 లక్షల భారీ  డెంగీ చికిత్స అందించారు. ఇందులో 2700 గ్లౌజులకు కూడా ఛార్జ్‌ చేశారు. ఎంత అవినీతి ’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్ కొద్ది రోజుల్లోనే వైరల్ అయ్యింది. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన అన్నీ వివరాలు సేకరించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.