అంబులెన్సు ఇవ్వలేదు.. 45 కీ.మీ దూరం శవాన్ని ఇలా.. - MicTv.in - Telugu News
mictv telugu

అంబులెన్సు ఇవ్వలేదు.. 45 కీ.మీ దూరం శవాన్ని ఇలా..

September 21, 2019

Rickshaw....................

అభివృద్ధి గురించి ప్రభుత్వాలు ఎన్ని గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అత్యంత దారుణంగా ఉంటున్నాయి. హైటెక్ యుగంలోనూ సామాన్యుడికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ప్రైవేటు వాహనాల్లో వెళ్లలేని వారికి అందుబాటులో ఉండాల్సిన అంబులెన్సుల  కొరత కారణంగా పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అంబులెన్సు లేకపోవడంతో హాస్పిటల్ నుంచి 45 కిలోమీటర్ల దూరం ఓ మహిళ శవాన్ని తన భర్త రీక్షాపై వేసుకొని లాక్కొని వెళ్లాడు. ఈ ఘటన అందరిని కంటతడి పెట్టించింది. 

శంకర్‌గఢ్‌లోని సరూర్‌గంజ్‌కు చెందిన కల్లూ భార్య తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న స్వరూప్ రాణి నెహ్రూ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. చికిత్స చేస్తుండగానే ఆమె మరణించింది. పేద కుటుంబం కావడంతో తిరిగి వెళ్లేందుకు చేతిలో చిల్లగవ్వ లేదు. కల్లూ వైద్యుల దగ్గరకు వెళ్లి అంబులెన్సును ఇప్పించాలని వేడుకున్నాడు. అయినా ఆసుపత్రి సిబ్బంది ఏమాత్రం పట్టించుకోలేదు. తమ వద్ద అంబులెన్సు అందుబాటులో లేదని కసురుకుంటూ చెప్పాడు.

శవాన్ని తీసుకెళ్లే మార్గం లేకపోవడంతో పుట్టెడు దుఖంలో రిక్షాలో వేసుకుని ప్రయాగ్ రాజ్ నుంచి ఇంటి వరకు ఏకంగా 45 కిలోమీటర్లు తీసుకెళ్లాడు. ఈ దృశ్యం చూసిన అక్కడున్న వారందరిని కంటతడి పెట్టించింది. కనీసం పేదవాడికి అంబులెన్సు ఇచ్చే పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వాలు లేవా అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నా హాస్పిటల్ సిబ్బంది తీరు మారకపోవడంతోపై స్థానికులు మండిపడ్డారు. ఇటువంటి ఘటనలపై  వెంటనే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.