Deo: Student's death left the school in a state of war..properties were destroyed
mictv telugu

వీడియో: విద్యార్థినీ మృతితో రణరంగమైన స్కూలు..ఆస్తులు ధ్వంసం

July 18, 2022

తమిళనాడు రాష్ట్రంలో ఓ ప్రైవేట్ స్కూల్‌పై నిరసకారులు ఆగ్రహంతో రగిలిపోయి, స్కూల్‌ ఆవరణంలో ఉన్న బస్సులకు నిప్పు పెట్టారు. అంతేకాదు, స్కూల్‌ లోపలికి చొరబడి, విలువైన కంప్యూటర్లను, కుర్చీలను పగలగొట్టారు. పరిస్థితిని అదుపుచేయడానికి వచ్చిన పోలీసులపై రాళ్లతో దాడిచేసి, వారి వాహనాలకు నిప్పంటించారు.

వివరాల్లోకి వెళ్తే… కళ్లకురిచ్చి జిల్లాలో ఆదివారం ఒక్కసారిగా హింస చెలరేగింది. కడలూరు జిల్లా కన్నియమూరు గ్రామంలో ఉన్న ఓ ప్రైవేటు ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో శ్రీమతి (17) అనే విద్యార్థినీ పదోవ తరగతి చదువుతుంది. అయితే, ఆ విద్యార్థినీ ఈ నెల 13న తాను చదివే ప్రైవేటు పాఠశాల ఆవరణలోనే మృతి చెందింది. దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, విద్యార్థిని తరపువారు ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం విద్యార్థినీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, విద్యార్థి సంఘాలు, నిరసనకారులు పెద్ద సంఖ్యలో పాఠశాలలోకి ప్రవేశించి, నానా రచ్చ చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపు చేస్తుండగా నిరసనకారులు పోలీసులపై దాడి, వారి వాహనాలకు నిప్పు పెట్టారు. అంతేకాదు ఆ పాఠశాలకు సంబంధించిన బస్సులను తగులబెట్టి, తరగతి గదులు, సామగ్రికి నిప్పు పెట్టారు. దాంతో అప్రమత్తమైన అధికారులు ఇతర జిల్లాల నుంచీ బలగాలని రప్పించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడిలో సుమారు 20 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. విద్యార్థిని మృతి కేసును సీబీసీఐడీ మార్చాలని బాధితురాలి తండ్రి కోరారు.