Deputy Speaker Padma Rao met trs Working President KTR over party change
mictv telugu

టీఆర్ఎస్‌లో నేను కూడా స్టేక్ హోల్డర్‌నే.. అలాంటి ఉద్దేశం లేదు : పద్మారావు గౌడ్

October 19, 2022

బీజేపీలో చేరబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా తనపై వస్తున్న వార్తలను తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ ఖండించారు. పార్టీని వీడే ఆలోచన లేదని, కొంత మంది కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటివి ఆపకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయి వివరణ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక వేళ ఈ ప్రచారం చర్చనీయాంశంగా మారడంతో పద్మారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో తాను కూడా స్టేక్ హోల్డర్‌ననే సంగతి గుర్తుంచుకోవాలన్నారు. అటు కిషన్ రెడ్డి ఇప్పటికే దీనిపై స్పందించారు. కొద్ది రోజుల కింద పద్మారావు తన కుమారుడి పెళ్లికి పిలిచారని, అప్పుడు వెళ్లడం కుదరకపోవడంతో మరుసటి రోజు వెళ్లి కొడుకు, కోడలిని ఆశీర్వదించి వచ్చానని తెలిపారు. అప్పటి వీడియో ఇప్పుడు ఎందుకు వైరల్ చేస్తున్నారో అర్ధం కావట్లేదన్నారు. పద్మారావు గౌడ్ తన పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యే అని గుర్తు చేశారు.