దేవుడి ఆస్తుల్ని అమ్ముతారా? మింగేస్తారా? వైవీ సుబ్బారెడ్డి వీడియో వైరల్
ఆంధ్రప్రదేశ్‌లో టీటీడీ భూముల వేలం పక్రియ అధికార, విపక్షాల మధ్య అగ్గిని రాజేసింది. దేవుని భూములు ఎలా అమ్ముతారని ప్రశ్నిస్తే.. గతంలో మీరు చేసిన పనేంటంటూ అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. దీంట్లో మాటా మాటా పెరగడంతో తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమా ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ దానికి సీఎం జగన్ సమధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు దేవాదాయ భూముల అమ్మకంపై తీర్మానం చేయడాన్ని వైసీపీ తప్పుబట్టింది. ఆ సమయంలో సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ఉన్న దేవుడి ఆస్తులను పరిరక్షించేది ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వమా? వారు పరిరక్షకులా? భక్షకులా? అంటూ ప్రశ్నించారు. దీన్ని పోస్టు చేసిన దేవినేని ఉమా.. సీఎం జగన్‌కు ప్రశ్నలు సందించాడు. ఇప్పుడు భూములు అమ్ముకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమొచ్చింది? ఇందులో ఆంతర్యం ఏంటి? ఈ భూబాగోతాలు అన్నిటి మీద కూడా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. దేవుని పేరుతో ఆస్తులు కాజేయాలని చూస్తున్నారు. ఈ అధర్మ పాలనను మనం క్షమిస్తే అది మనల్ని మింగేసే వరకు వచ్చింది. దీనిపై అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది’ అంటూ పేర్కొన్నారు. దీంతో అప్పట్లో సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలంటూ టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారపక్షంలో ఉన్నప్పుడు మరోలా ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.
దేవుడి ఆస్తులను పరిరక్షించాల్సింది ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం. భూములు అమ్ముకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది? రాష్ట్రంలోని ప్రజలఆస్తులను దేవుడిఆస్తులను మింగేస్తున్న వారు రక్షకులా! భక్షకులా! అన్న మీ బాబాయి మాటలకు ప్రజలకు సమాధానంచెప్పండి ముఖ్యమంత్రి @ysjagan గారు pic.twitter.com/dVn970sQu5
— Devineni Uma (@DevineniUma) May 24, 2020