భక్తుల్లారా.. టీటీడీకి ఇప్పుడెవరు రాకండి - MicTv.in - Telugu News
mictv telugu

భక్తుల్లారా.. టీటీడీకి ఇప్పుడెవరు రాకండి

May 29, 2022

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఓ కీలక విషయాన్ని తెలియజేసింది. గతకొన్ని రోజులుగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవటానికి భక్తులు విపరీతంగా వస్తున్నారని, దాంతో తిరుమలలో విపరీతమైన రద్దీ నెలకొంటుందని అధికారులు.. వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ, ప్రకటన విడుదల చేశారు. రద్దీ తగ్గే వరకు వీఐపీలు గాని, సామాన్య భక్తులు గాని తిరుపతికి రావొద్దని, ప్రస్తుతానికి తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని కోరారు.

టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ”తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తున్నారు. ఆ కారణంగా రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ విషయంపై శనివారం సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసి, రద్దీ తగ్గే వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని నిర్ణయించాం. మళ్లీ రద్దీ తగ్గక ప్రకటన విడుదల చేస్తాం. అప్పటి వరకు వీఐపీలు, భక్తులు తిరుపతికి రావొద్దు. గంటకు 4,500 మందిని మాత్రమే దర్శనం చేయించగల్గుతున్నాం. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి, పర్యటనను వాయిదా వేసుకోండి.” అని ఆయన అన్నారు.

మరోపక్క తెలంగాణలో ఇంటర్, పదోవ తరగతి పరీక్షలు పూర్తి కావడం, వేసవి సెలవులు రావడంతో భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున తిరుపతికి తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో తిరుమలలో రద్దీ తీవ్రంగా నెలకొంది. సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు నిండిపోయాయి. లేపాక్షి మీదుగా అన్నదానం వరకు దాదాపు రెండున్నర కిలోమీటర్ల మేర క్యూ ఉంది. వీరందరికీ 48 గంటల తర్వాత దర్శనం లభిస్తున్నట్టు టీడీపీ తెలిపింది.