భక్తులతో కిక్కిరిన తిరుమల కొండ.. దర్శనానికి 24 గంటలు
తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసిపోయింది. సమ్మర్ హాలిడేస్ కావడం.. పైగా వీకెండ్ కావడంతో శ్రీవారి దర్వనానికి భక్తులు పోటెత్తారు. ఎస్ఎస్డీ టికెట్లు లేకుండా దర్వనానికి వచ్చే భక్తులు అన్ని కంపార్ట్ మెంట్లలో నిండిపోయి, శిలాతోరనం వరకు లైన్లలో వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శన భాగ్యం కలుగడానికి దాదాపు 24 గంటల సమయం పట్టేలా ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న టీటీడీ భక్తులకు ఏ ఇబ్బంది కలుగకుండా చూస్తోంది. క్యూ లైన్లు, కంపార్ట్ మెంట్లలో ఉండే భక్తులకు నీళ్లు, అన్నప్రాసాదాలు అందించేందుకు అన్ని చర్యలు చేపట్టింది. మరోవైపు కొండపై గదుల కోసం రద్దీ కొనసాగుతుంది.
గురువారం నుంచి తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం అర్ధరాత్రి వరకు 74, 583 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. శుక్రవారం నాడు 79, 486 మంది భక్తులు దర్శించుకోగా.. 40, 250 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. దీంతో శుక్రవారం ఒక్కరోజే హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు వచ్చాయి. రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్ ద్వారా స్వామి వారి దర్శనం సకాలంలో జరుగుతోంది. దర్శనం టికెట్ లేని భక్తులకు మాత్రం దాదాపు 36 గంటల టైం పడుతోంది.