తిరుమలకు క్యూ కట్టిన భక్తులు.. అలిపిరి వద్ధ ట్రాఫిక్ జాం - MicTv.in - Telugu News
mictv telugu

తిరుమలకు క్యూ కట్టిన భక్తులు.. అలిపిరి వద్ధ ట్రాఫిక్ జాం

March 19, 2022

14

తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు క్యూ కడుతున్నారు. దీంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు బారులు తీరాయి. కరోనా మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాలపాటు స్వామివారి దర్శనానికి దూరమైన భక్తులు శనివారం భారీ సంఖ్యలో తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో అలిపిరి వద్ధ వాహనాలను తనీఖీలు చేస్తున్న అధికారులు సమయం పడుతుందని చెప్పడంతో.. గంటల కొద్ది భక్తులు వాహనాల్లోనే వేచి ఉన్నారు. సాధార‌ణ రోజులతో పోలిస్తే, శని, ఆదివారాల్లో వెంక‌న్న స్వామి ద‌ర్శ‌నానికి భక్తులు వారం వారం భారీగా తరలివస్తారు.

మరోవైపు తిరుమలకు చేరుకున్న యాత్రికులకు అద్దె గదుల కొరత ఏర్పడుంది. రద్దీకి సరిపడా గదులు లేకపోవడంతో భక్తులు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం 66,763 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 33,133 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. రూ.4.29 కోట్లు హుండీ ద్వారా ఆదాయం వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది.

ఇటీవలే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన తిరుమల ఆర్జిత సేవ టిక్కెట్లను విడుదల చేస్తున్నామని, అందుకు సంబంధించి టికెట్లను ఈనెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది.