మిడతలతో విమానాలకు ముప్పు.. పైలట్లూ జాగ్రత్త - MicTv.in - Telugu News
mictv telugu

మిడతలతో విమానాలకు ముప్పు.. పైలట్లూ జాగ్రత్త

May 29, 2020

Locust

ఓవైపు కరోనా వైరస్‌తో ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతుంటే ఇప్పుడు రాకాసి మిడతల దండు పెద్ద తలనొప్పిగా మారింది. వీటి రాకతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హైరానా చెందుతున్నాయి. ఓ గాయం తీవ్రంగా సలుపుతుండగా మరోగాయం అవడం అంటే ఇదేనేమో. రైతుల పంటలను ఇవి పూర్తిగా నాశనం చేస్తున్నాయి. అయితే, ఇప్పుడు ఈ మిడతల వల్ల విమానాలకు కూడా కొత్త సమస్య వచ్చి పడింది. విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ అవుతున్న సమయంలో వీటితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం వెల్లడించింది. ఈ మేరకు పైలట్లు, ఇంజినీర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. 

మిడతలు సాదారణంగా తక్కువ ఎత్తులో ఎగురుతాయి గనుక.. ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో జాగ్రత్తలు వహించాలని సూచించింది. అవి ఇంజన్‌లోని ఎయిర్ కండిషనింగ్ ప్యాక్ ఇన్లెట్‌లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని హెచ్చిరించింది. పాకిస్తాన్ నుంచి భారత్‌లోని గుజరాత్, పంజాబ్‌లోకి వచ్చిన ఈ మిడతలు.. ఇప్పుడు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. కాగా, తెలంగాణ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫైరింజన్లను సిద్దంగా ఉంచిన విషయం తెలిసిందే.