మెదక్ జిల్లాలో జరిగిన లాకప్ డెత్ ఘటనపై డీజీపీ అంజనీకుమార్ సీరియస్ అయ్యారు. బాధ్యులైన సీఐ, ఎస్సైలపై శాఖపరమైన చర్యలు తీసుకుంటూ ఘటనపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అధ్వర్యంలో విచారణకు ఆదేశించారు.
అసలేం జరిగిందంటే..
జనవరి 27వ తేదీన మెదక్‌లోని అరబ్ గల్లీలో గోల్డ్ చెయిన్ చోరీకి గురైందని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఖదీర్ ఖాన్ అనే వ్యక్తిని జనవరి 29న అదుపులోకి తీసుకొని స్టేషనులో ఉంచి ఫిబ్రవరి 2వ తేదీన కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ఇంటికి వెళ్లిన ఖదీర్.. మరుసటి రోజే అనారోగ్యానికి గురవడంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందించి తర్వాత గాంధీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఫిబ్రవరి 12న మరణించాడు. దీంతో పోలీసులు కొట్టిన దెబ్బల వల్లే ఖదీర్ ఖాన్ చనిపోయాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా డీజీపీ స్పందిస్తూ ఘటనపై విచారణకు ఆదేశిస్తూ నిర్ణయం తీసుకున్నారు.