Dgp Mahender Reddy Congratulates Next Dgp Anjani Kumar
mictv telugu

రానున్న రోజుల్లో ఎక్కువ నేరాలు డిజిటల్ రూపంలోనే.. డీజీపీ మహేందర్ రెడ్డి

December 31, 2022

డీజీపీ మహేందర్‌ రెడ్డి పదవీకాలం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్‌ అకాడమీలో పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. పోలీసు అధికారులు తనపై చూపిన ఆదరణకు ధన్యవాదాలు తెలిపారు. గత 36 ఏండ్లుగా పోలీస్‌ శాఖలో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. కేరీర్‌లో తనకు సహకరించినవారికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక శాంతిభద్రతల గురించి అపోహలున్నా వాటిని అధిగమించినట్టుగా చెప్పారు. పోలీస్‌ శాఖకు సీఎం కేసీఆర్‌ దిశా నిర్ధేశం చేసి శాంతిభద్రతలకు పెద్దపీట వేశారని తెలిపారు.

పోలీస్ శాఖలో పనిచేస్తున్న వారి జీతభత్యాలు, సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని అన్నారు. కేసీఆర్ తెలంగాణలో దూరదృష్టి గల నాయకత్వం అందిస్తున్నారని తెలిపారు. ఐదేళ్లు డీజేపీగా ఉండే అవకాశం ఇచ్చినందుకు, మోడ్రన్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు సహకరించినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నట్టుగా తెలిపారు. టెక్నాలజీతో ఎన్నో కేసులు పరిష్కరించామని చెప్పారు. రానున్న రోజుల్లో నేరాలు డిజిటల్ రూపంలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. పోలీసులందరూ టెక్నాలజీతో పాటు అప్‌డేట్ కావాలని తెలిపారు. విజనరీని దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

తదుపరి డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్న అంజనీ కుమార్‌కు అభినందనలు తెలిపారు. అంజనీకుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ పోలీస్ శాఖ మరింత బలపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక, తెలంగాణ నూతన డీజీపీగా అంజనీకుమార్ ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు డీజీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు.