‘‘మానవజాతి కొవిడ్ మహమ్మారి నుంచి మనం అందించిన సేవల వల్ల బయటపడలేదని, ఏసుక్రీస్తు కృప, దయవల్లే కరోనా తగ్గింది’’ అని వ్యాఖ్యానించిన రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు మాట మార్చారు. కొత్తగూడెంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో డీహెచ్ గడల శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఆయన మాటల వీడియో వైరల్ అయింది. విమర్శలు వెల్లువెత్తడంతో డీహెచ్ స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
‘దయచేసి నా వ్యాఖ్యలను వక్రీకరించొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా. కొన్ని మీడియా సంస్థలు నా ప్రసంగంలోని కొంత భాగాన్ని కట్ చేసి, వివాదాన్ని సృష్టించడం నన్ను తీవ్రంగా కలచివేసింది. కేవలం క్రీస్తు ద్వారానే కరోనా సమసిపోయింది అని నేను అన్నట్టు వీడియో క్లిప్ కట్ చేసి ప్లే చేస్తున్నారు. ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా’ అని తెలిపారు. పూర్తి ప్రసంగం యూట్యూబ్లో ఉందని, దాన్ని చూడాలని కోరారు.
అయితే అంతకుముందు సమావేశంలో ‘ఆ ఏసు క్రీస్తు కృపతోనే కరోనా తగ్గింది. ఆధునిక విద్య, వైద్య సంస్కృతిని మనదేశానికి, రాష్ట్రానికి తీసుకొచ్చింది క్రైస్తవులే. లేదంటే భారతదేశం ప్రపంచ దేశాల్లో మనుగడ సాధించేది కాదు. క్రైస్తవులతోనే దేశం అభివృద్ధి చెందింది’ అని కూడా అన్నారు.