4 రోజుల క్రితం ఏసు క్రీస్తు దయతో కరోనా తగ్గిందని సంచలన వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు పాలైన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు.. మళ్లీ అలాంటి కామెంట్సే చేశారు. యాదాద్రీశుడి దయతో కొవిడ్ వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని తెలిపారు. ప్రభుత్వం పూర్తి అప్రమత్తతో ఉన్నందున.. కరోనాపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. శనివారం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న డీహెచ్ శ్రీనివాసరావు అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా.. యాదాద్రీశుని దయ వల్లే రెండేళ్లుగా కరోనాను సమర్థవతంగా ఎదుర్కొన్నామంటూ చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఫోర్త్ వేవ్ వ్యాప్తించకుండా అన్ని ఏర్పాట్లు తీసుకున్నామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీహెచ్ తెలిపారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి కొవిడ్‌పై పూర్తి స్థాయిలో సమీక్ష జరిపామన్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్నా.. మరణాల శాతం ఉండబోదని, ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపదని డీహెచ్ వివరించారు.
కరోనా నుంచి ఏసుక్రీస్తు కాపాడాడని తాను చేసిన కామెంట్స్‌పై వస్తున్న విమర్శల వల్లే.. డీహెచ్ దాద్రీశున్ని దర్శించుకున్నారని ప్రచారం జరుగుతోంది. వాటన్నింటిని యాదాద్రీశుని దర్శనంతో సమం చేయాలన్న ఉద్దేశంతోనే డీహెచ్ ఈ సందర్శన చేశారనేది బయట నడుస్తున్న టాక్. అయితే.. మొన్నేమో ఏసు కృప అంటివి.. ఈరోజేమో యాదాద్రీశుని దయ అనవడ్తివి.. అసలు ఏంటయ్యా డీహెచ్ ఇది.. మెడికల్ రంగంలో ఉండి ఇలాంటి స్టేట్మెంట్లు పాస్ చేస్తూ సమాజానికి ఏం మెస్సేజ్ ఇస్తున్నట్టు.. అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు డీహెచ్‌పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.