ఇంతకాలం తమ పరువుకు భంగం కలిగించింది చాలని, ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ ఓ వృద్ధ దంపతులకు హీరో ధనుష్, ఆయన తండ్రి కస్తూరి రాజా లీగల్ నోటీసులు పంపించారు. ధనుష్ తమ రక్తం పంచుకుని పుట్టిన కుమారుడు అంటూ మధురైకి చెందిన కేతిరేశన్, మీనాక్షి దంపతులు కొన్నాళ్ల కిందట మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడం కలకలం సృష్టించింది. ధనుష్ తమ మూడో కుమారుడని, చిన్నతనంలోనే ఇంటి నుంచి పారిపోయాడని, హీరో అయినప్పటి నుండి తమకు ప్రతి నెలా రూ.65 వేలు పంపిస్తున్నారని ఆ దంపతులు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. అయితే వారి మాటలు అబద్ధాలు అని.. ధనుష్ పై కేవలం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు ఆయన తండ్రి కస్తూరి రాజా. తన గురించి అసత్య ప్రచారం చేస్తున్న మదురై దంపతులకు ధనుష్, ఆయన తండ్రి కస్తూరి రాజా నోటీసులు పంపారు. తమ గౌరవానికి ఇబ్బంది కలిగించేలా చేస్తోన్న ఆరోపణలకు ఇకనైనా ఫుల్స్టాప్ పెట్టాలని కోరారు. ఇంతకాలం చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని పేర్కొంటూ క్షమాపణలు చెబుతూ ఓ స్టేట్మెంట్ని వెంటనే విడుదల చేయాలని ధనుష్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.