dhanush sir telugu movie review
mictv telugu

ధనుష్ నటించిన సార్ మూవీ రివ్యూ..

February 17, 2023

dhanush sir telugu movie review

బైలింగ్వల్ ప్రాజెక్టుగా ధనుష్ తెలుగులో నటించిన తొలిచిత్రం కావడం, కార్పొరేట్ విద్యావ్యవస్థ నేపథ్యంతో సాగే పీరియాడికల్ కథ అవడంతో సార్ చిత్రంపై ఆడియెన్సులో మంచి అంచనాలే ఉన్నాయి. ఓ సింపుల్ కథతో సాగే ఎమోషనల్ అండ్ సోషల్ మెసేజ్ సినిమా అని ప్రమోషన్లలో మేకర్స్ చెప్పడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి కాస్త పెరిగింది. మరి ఈ శుక్రవారం విడుదలై ప్రేక్షకుల ముందుకొచ్చిన సార్ ఎలా ఉంది? ఆడియెన్సును ఏ మేరకు అలరించగలిగింది?

కథ విషయానికొస్తే..
కార్పొరేట్ కాలేజీల ద్వారా విద్యను వ్యాపారంగా మార్చేస్తూ చదువనేది కొనగలిగే వారికి మాత్రమే అందుబాటులో ఉండేలా తన విద్యాసంస్థల్ని విస్తరింపచేస్తాడు త్రిపాఠి(సముద్రఖని). దాంతో ప్రభుత్వ కాలేజీలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పూర్తిగా పడిపోయి అవి మూతపడే స్థితికొస్తాయి. ఈ విషయంలో తీవ్ర వ్యతిరేకత రావడంతో గవర్నమెంటు కాలేజీల్ని దత్తత తీసుకుని, తన కాలేజీల్లోని స్టాఫ్ తోనే పాఠాలు చెప్పిస్తానని, తానే జీతాలూ చెల్లిస్తానని ప్రకటిస్తాడు త్రిపాఠి. అలా కడపలోని సిరిపురం అనే ఓ కాలేజీలో లెక్చరర్ గా చేరతాడు బాలగంగాధర్ తిలక్(ధనుష్). కానీ ఆ ప్రభుత్వ కాలేజీలో పిల్లలెవరూ చదువుపై పెద్దగా ఆసక్తి చూపరు. తల్లిదండ్రులు కూడా పనిలోకి పంపడానికే తప్ప కాలేజీకి పంపడానికి ఇష్టపడరు. కానీ బాలు ఆ విద్యార్థుల్ని ఎలా మార్చాడు? చదువు విలువను ఊర్లోవారికి తెలిసేలా ఏం చేశాడు? తన కొలీగైన బయాలజీ టీచర్ మీనాక్షి(సంయుక్త మీనన్) సహాయంతో ఎలా మంచి ఫలితాలు రాబట్టాడు? తన కార్పొరేట్ కాలేజీల కంటే మెరుగ్గా గవర్నమెంట్ కాలేజీ విద్యార్థులు ప్రతిభ కనబర్చడంతో త్రిపాఠి బాలుపై ఎలాంటి కుట్రలు పన్నాడు? చదువనేది అందరికీ అందాలన్న బాలు ఆశయం ఎలా నెరవేరింది? అనేదే అసలు కథ.

కథనం ఎలా ఉందంటే..
ఎక్కడా ఆలస్యం చేయకుండా ప్రారంభం నుంచే పాత్రల్ని పరిచయం చేస్తూ ముఖ్యకథలోకెళ్లిపోతుంది సినిమా. ఇంట్రో ఫైట్, కొన్ని కామెడీ సీన్లు, కథని రక్తికట్టించే ఇంకొన్ని సన్నివేశాలతో ఫస్టాఫ్ ముగుస్తుంది. సెకండాఫ్ లో కొన్ని ఊహించగలిగే సీన్లున్నా, కథలో మాత్రం ఎక్కడా ల్యాగ్ చేయకుండా, విద్యా వ్యవస్థపై మరీ సందేశాలిస్తూ బోర్ కొట్టించకుడా, చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేస్తూ సింపుల్ గా సినిమాని ముగించేశారు. పాత్రలపరంగా కొన్ని ఎలివేషన్లను, ఎమోషన్లను కొన్నిచోట్ల బాగా పండించాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి. కమర్షియల్ గా వర్కవుటవ్వాలని ఎక్కువ పాటలు, డ్యాన్సులు, సపరేట్ సెట్లలో వేసే మాస్ బీట్లు లేకుండా కథపైనే ఫోకస్ పెట్టి అవసరమైనంత వరకే చక్కగా ప్లాన్ చేశారు. హైపర్ ఆదిని ఎక్కువసేపు కామెడీ కోసం వాడకుండా కొద్దిసేపటికే సైడ్ చేయడంతో ఆడియెన్సు కూడా హాయిగా ఫీలయ్యారు.

ఎవరెలా చేశారంటే..
కథలో మరీ ఎగ్జయిటయ్యే అంశాలు, షాకయ్యే ట్విస్టులు లేకపోయినా తన నటనతో సింగిల్ మ్యాన్ షో గా సినిమాని నడిపించాడు ధనుష్. తన కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్ని చేసున్న ధనుష్ కి ఈ మూవీలో లెక్చరర్ పాత్ర పెద్ద ఛాలెంజింగ్ రోల్ కాకపోయినా ఓ యాక్టర్ గా ఫుల్ మార్కులు కొట్టేశాడు. హీరోయిన్ గా సంయుక్త మీనన్ తన పాత్రకు న్యాయం చేసింది. సముద్రఖని, సాయికుమార్, తనికెళ్ల భరణితో పాటు కాలేజీ స్టూడెంట్సుగా పిల్లలు కూడా చక్కగా నటించారు.

డైరెక్టర్ గా వెంకీ అట్లూరి తన గత చిత్రాలతో పోలిస్తే మేకింగ్ పరంగా చాలా డవలపయ్యాడనే చెప్పొచ్చు. సోషల్ మెసేజ్ ఇచ్చే కథని టేకప్ చేస్తూనే కమర్షియల్ గా వర్కవుటయ్యేలా చూసుకున్నాడు. గత రెండు సినిమాలు ఫ్లాపే అయినా ధనుష్ లాంటి స్టార్ తో బైలింగ్వల్ మూవీని బాగా టేకప్ చేశాడు. ఇక సినిమాకి మరో ప్రధాన బలం జీవీ ప్రకాష్ అందించిన సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతంతోనూ తన మార్క్ చూయించాడు. ఇంటర్వెల్ తో పాటు కొన్నియాక్షన్ సీన్లలోనూ వీణతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసి చదువు(సరస్వతి) కోసం హీరో పడుతున్న కష్టాన్ని ఎలివేట్ చేశాడు. కెమెరా వర్క్ తోనూ యువరాజ్ సూపరనిపించాడు. పీరియాడికల్ కథ కావడంతో ఆ లుక్ వచ్చేలా ప్రొడక్షన్ వాల్యూలని పాటించారు నిర్మాతలు. బైలింగ్వల్ అని ప్రమోషన్లో చెప్పుకొచ్చినా కొన్ని సీన్ల దగ్గర డబ్బింగ్ మూవీ చూసిన ఫీల్ మాత్రం కలుగుతుంది. తల్లిదండ్రుల కష్టాన్ని గురించి, కార్పొరేట్ విద్యావ్యవస్థ గురించి, చదువు గొప్పతనం గురించి చెప్పే కొన్ని డైలాగులు చప్పట్లు కొట్టేలా చేస్తే, ఇంకొన్ని డైలాగులు ఆలోచింపచేసేలా ఉన్నాయి. డైరెక్టర్ గానే కాకుండా డైలాగ్ రైటర్ గా కూడా వెంకీ అట్లూరి సక్సెసయ్యాడు.

ఓవరాల్ గా ఎలా ఉందంటే..
సోషల్ మెసేజ్ కథే అయినా కమర్షియల్ ఎలిమెంట్లకి, ఎలివేషన్లకి ఏ మాత్రం లోటు లేకుండా, ఫ్యామిలీ అంతా చూడగలిగేలా ఓ సింపుల్ కథని సిల్వర్ స్క్రీన్ పై చూడాలనుకుంటే చక్కగా ఓసారి చూసేయొచ్చు.