తెలంగాణలో ఇకపై జరిగే భూములు రిజిస్ట్రేషన్లలో అక్రమాలు ఉండవని, అన్నీ పారదర్శకంగా సాగుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఈ రోజు మూడుచింతపల్లిలో ధరణి వెబ్ సైట్ను ప్రారంభించారు. రెవిన్యూ విభాగంలో సమూల మార్పుల కోసం ఏర్పాటు చేసి ఈ సైట్లో కోటి, 45 లక్షల 58 వేల ఎకరాల భూముల వివరాలు ఉన్నాయని కేసీఆర్ వెల్లడించారు.
‘ధరణి దేశానికే ఓ ట్రెండ్ సెట్టర్. తెలంగాణ యోధుడు వీరారెడ్డి పుట్టిన ఊరిలోనే దీన్ని ప్రారంభిస్తున్నాం. కేవలం అరగంటలోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తవుతుంది. ఇది అనేక విషయాల్లో దేశానికి దారి చూపుతంది. మిషన్ భగీరథ విజయవంతంమైనప్పుడు ఎలా సాధ్యమైందని అందరూ ఆశ్చర్యపోయారు. ధరణి విషయంలోనూ అదే జరుగుతుంది. సంకల్పం ఉంటే సాధ్యం కానిది లేదు. రాష్ట్రంలోని రైతుల భూములను కాపాడటానికే ధరణి పోర్టల్ తీసుకొచ్చాం.. ’ అని సీఎం తెలిపారు. ఇది పెద్ద సంస్కరణ అని, తొలుత చిన్న చిన్న సమస్యలు సాధారణమేని, వాటిని ఎదుర్కొని ముందుకు సాగుతామని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని పూర్తిగా మార్చేశామని, ప్రస్తుతం తెలంగాణ నుంచే 55 శాతం ధాన్య సేకరణ జరగుతోందని కేసీఆర్ చెప్పారు.