Dharmapuri under water..Bhadrachalam in danger zone
mictv telugu

 నీట మునిగిన ధర్మపురి..డేంజర్‌ జోన్‌లో భద్రాచలం

July 13, 2022

తెలంగాణ రాష్ట్రంలో గత ఐదు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్షాల కారణంగా పలు జిల్లాలో గుంటలు, చెరువులు, వాగులు, వంకలు వరదతో నిండి పొంగిపోర్లుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నది ఒక్కసారిగా ఉప్పొంగింది. దాంతో ధర్మపురి పట్టణంలోకి వరదనీరు భారీగా పోటెత్తుతోంది.

దీంతో ధర్మపురిలోని పలు కాలనీలు, ఇండ్లు జలమయమయ్యాయి. అంతేకాదు ధర్మపురి పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. బీరపూర్ మండలం కమ్మునూర్ వద్ద గోదావరి వరద తీవ్రతకు అక్కడ స్మశానం పూర్తిగా మునిగిపోయింది. వర్షాల ధాటికి పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక, మల్లాపూర్ మండలం గొర్రెపల్లి వద్ద పెద్ద చెరువు తెగిపోవడంతో వరదనీరు పొలాల్లోకి భారీగా వచ్చి చేరింది.

మరోపక్క గోదావరి నదికి వరద నీరు భారీగా వచ్చి చేరుతున్న కారణంగా బుధవారం ఉదయం నుంచి భద్రాచలానికి ఊహించని రీతిలో వరద నీరు పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మేడిగడ్డ, సమ్మక్క సాగర్ వద్ద వరద ఉద్ధృతి కొనసాగుతతోంది. దీంతో వచ్చే రెండు రోజుల్లో గోదావరి నుంచి 21 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలిసే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 64 అడుగులకు చేరు అవకాశముందని కలెక్టర్ అనుదీప్ ప్రకటించారు. ఆ అంచనా నిజమైతే భద్రాచలం డేంజర్‌ జోన్‌లోకి వెళ్లినట్లేనని.. భారీగా ఆస్తినష్టం జరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.