Dialysis center in Langerhouse Masjid.. free treatment for all
mictv telugu

లంగర్‌హౌజ్ మసీదులో డయాలసిస్ సెంటర్.. అందరికీ ఫ్రీ చికిత్స

July 22, 2022

హైదరాబాద్ నగరం మరో వినూత్న కార్యక్రమానికి వేదికైంది. లంగర్ హౌజ్‌లోని మసీదులో ఉచిత డయాలసిస్ కేంద్రం ఏర్పాటైంది. మస్జిద్ ఏ మహమ్మదియాలో కొత్తగా పెట్టిన ఈ కేంద్రాన్ని కిడ్నీ మార్పిడి సర్జన్, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ షోయబ్ అలీఖాన్ నిర్వహిస్తున్నారు. సీడ్ అజ్, హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ వంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏర్పాటైన ఈ సెంటర్‌లో అన్ని సేవలను ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో ఏర్పాటు చేసిన ఈ డయాలసిస్ సెంటర్‌లో కుల, మత భేదాలు లేకుండా అందరికీ ఉచిత చికిత్స అందించనున్నారు. ఇందుకోసం అలీఖాన్‌కు తోడుగా మరో డాక్టరు, నర్సులు, డయాలసిస్ టెక్నీషియన్లు, అంబులెన్స్ అందుబాటులో ఉంచారు. ఈ సెంటరులో ఉచిత డయాలసిస్ చికిత్స పొందాలనుకునేవారు 9603540864కి ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు వెల్లడించారు. కాగా, ప్రైవేటులో ఖరీదైన ఈ డయాలసిస్‌ను ఉచితంగా అందిస్తున్న నిర్వాహకుల మనసుకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు.