వజ్రాల మాస్కులు.. ధనవంతుల దర్జా  - MicTv.in - Telugu News
mictv telugu

వజ్రాల మాస్కులు.. ధనవంతుల దర్జా 

July 11, 2020

Diamond masks new trend surat 

జట్టు ఉన్న అమ్మ ఏ కొప్పు అయినా పెడుతుంది. డబ్బులున్న అయ్య ఏ మాస్క్ అయినా పెడతాడు. ఇది కరోనా కలికాలం. మనిషిని చూసి మనిషి భయపడుతున్న విలయకాలం. కానీ దీన్ని కూడా కొందరు తమ దర్జాను ప్రదర్శించుకోడానకి అనుకూలంగా మలచుకుంటున్నారు. 

కరోనా వైరస్‌కు మందు లేకపోవడంతో మాస్కులు, శానిటైజర్లే ఆయుధాలుగా మారాయి. అందరూ ఒకే రకం మాస్కులు వాడితే తమ ప్రత్యేకత ఏముంటుందని కొందరు కళలు ప్రదర్శిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన శంకర్ కురాడే అనే కుర్రాడు ఇటీవల 3 లక్షల రూపాయలు ఖరీదు చేసే బంగారు మాస్క్ పెట్టుకుని కలకలం రేపాడు. తాడిని తన్నే వాడుంటే వాడి తల తన్నేవాడు ఉంటాడు కదా. బోడి బంగారం మాస్క్‌లో గొప్ప ఏముందని కొందరు వ్యాపారులు ఏకంగా  వజ్రాల మాస్కులు మార్కెట్లోకి తీసుకొచ్చాడు. 

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి కుశాల్ భాయ్, దీపక్ చోక్సీలు వీటిని తయారు చేస్తున్నారు. వజ్రాల నాణ్యత, వజ్రాల సంఖ్య  బట్టి ఒక్కో మాస్క్ ధర లక్షన్న నుంచి నాలుగు లక్షలు వరకు పలుకుతోంది. మాస్కులు బాగానే ఉన్నాయిగాని ఇంత ధరపెట్టి వీటిని ఎవరైనా కొంటారా అనే అనుమానం వచ్చింది కదూ. దీనికి కూడా సమాధానం ఉంది. ‘వజ్రాల మాస్కులకు బాగా డిమాండ్ ఉంటుంది. అందరూ నీలిరంగు, తెల్లరంగు మాస్కు పెట్టుకుంటే మన ప్రత్యేకత ఏముంటుంది? పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో మీరు వజ్రాల మాస్క్ పెట్టుకుంటే అందరి చూపూ మీపైనే ఉంటుంది కదా..’ అని అంటున్నారు. 

తనకు, తన కాబోయే భార్యకు వజ్రాల మాస్కులు కావాలంటూ ఓ పెళ్లికొడుకు ఆర్డర్ ఇచ్చాడని మరో వ్యాపారి దీపక్ చోక్సీ చెప్పాడు. వాటిని తయారు చేసిచ్చాడు. తర్వాత మరికొందరు అడిగారు. అమెరికన్ డైమెండ్స్, గోల్డ్ కలిపి వీటిని తయారు చేస్తున్నాం.. ’ అని ఆయన వెల్లడించాడు.