కరోనా వైరస్ ఎఫెక్ట్..నౌకలో చిక్కుకున్న 3700 మంది - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా వైరస్ ఎఫెక్ట్..నౌకలో చిక్కుకున్న 3700 మంది

February 4, 2020

vbn

కరోనా వైరస్ చైనా దేశంతో పాటు అనేక దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా చైనాలో దాదాపు 370 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 17000 మందికి ఈ వైరస్ సోకినట్లు అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. దీంతో చైనా నుంచి ఎవరైనా తమ దేశంలోకి వస్తే ప్రపంచ దేశాలు హడలిపోతున్నాయి. ప్రయాణికులకు అందరికీ వైద్య పరీక్షలు చేసిన తరువాతే అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ నౌకలో ప్రయాణిస్తున్న వారిని కూడా కరోనా వైరస్ వదలలేదు.

3711 మంది ప్రయాణిస్తున్న జపాన్‌కు చెందిన ఓ క్రూయిజ్ నౌకలో ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. యొకొహామా తీరానికి చేరిన ఈ నౌకను జపాన్ ప్రభుత్వం అక్కడే నిలిపేసింది. దీంతో ప్రయాణికులంతా 24గంటలుగా అందులోనే ఉండిపోయారు. ప్రయాణికులందరికి వైద్య పరీక్షలు చేసే వరకు వారిని బయటకు వదిలేది లేదని అధికారులు తెలిపారు. వైద్యులు నౌకలోకి వెళ్లి పరీక్షలు చేస్తున్నారు. హాంగ్ కాంగ్‌కు చెందిన 80 ఏళ్ల ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు గుర్తించారు. ఇటీవల ఇదే నౌకను ఒకినావా పోర్టు తీరంలోనూ ఆపడం జరిగింది.