వెనక్కి తగ్గేదేలేదు: అనిల్‌పురి - MicTv.in - Telugu News
mictv telugu

వెనక్కి తగ్గేదేలేదు: అనిల్‌పురి

June 20, 2022

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకం విషయంలో వెనక్కి తగ్గేదే లేదని, ఇకపై నియమకాలన్నీ కొత్త పథకం ద్వారానే జరుగుతాయని సైనిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురి తేల్చి చెప్పారు. ఇప్పటికైనా ‘అగ్నిపథ్‌’పై దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్న యువకులు అర్థం చేసుకోని వెంటనే ఆందోళనలను విరమించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అనిల్ పురి మీడియాతో మాట్లాడుతూ..”ఇప్పటికే సైనిక ర్యాలీల్లో పాల్గొని శారీరక, వైద్య, ప్రవేశ పరీక్షలు పూర్తి చేసి అపాయింట్‌మెంట్ లెటర్ కోసం ఎదురుచూస్తున్న వారు కూడా మళ్లీ ‘అగ్నిపథ్’ పథకం కింద దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఇటువంటి వారి కోసం పరిమితిని ఈ ఏడాది 23 ఏళ్లకు పెంచాం. ‘అగ్నిపథ్’ పథకం కింద వైమానిక దళంలో ఈ నెల 24 నుంచి నమోదు ప్రక్రియ ఆరంభం అవుతుంది. జులై 24 నుంచి తొలి దశ ఆన్‌లైన్ పరీక్ష ప్రక్రియ ప్రారంభం అవుతుంది. డిసెంబరు చివరి నాటికి ‘అగ్నివీర్’ తొలి బ్యాచ్ నియామకం పూర్తై, డిసెంబర్ 30 నుంచి శిక్షణ మొదలవుతుంది. నేవీలో నియామకాల కోసం ఈ నెల 25న మార్గదర్శకాలు విడుదలవుతాయి. నవంబరు 21కల్లా మొదటి దశ బ్యాచ్ శిక్షణ ప్రారంభమవుతుంది. ఈసారి నేవీలో మహిళలకు కూడా అవకాశం కల్పిస్తాం. వాళ్లు యుద్ధ నౌకల్లోనూ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది” అని ఆయన అన్నారు.

మరోపక్క ఆర్మీలో నియామకాల కోసం నేడు ముసాయిదా నోటిఫికేషన్ వెలువరించనున్నారు. ‘జాయిన్ ఇండియా’ వెబ్‌సైట్ ద్వారా జులై 1 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు బ్యాచ్‌లుగా నియమకాలు జరుగనున్నాయి. తొలి బ్యాచ్‌లో 25 వేల మందిని డిసెంబరు రెండో వారానికల్లా నియమిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెండో బ్యాచ్ నియామకం జరుగుతుంది. రెండింటిలో కలిపి మొత్తంగా 40 వేల మందిని నియమించనున్నారు. ప్రస్తుతం సైనిక దళాల వద్ద 60 వేల మందికి శిక్షణనిచ్చే సామర్థ్యం ఉందని, దానిని క్రమంగా 90 వేల నుంచి 1.20 లక్షలకు తీసుకెళ్తామని ఇటీవలే అధికారులు తెలిపారు.

ఇక, వాయుసేన విషయానికొస్తే.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయే అగ్నివీరులకు కోటి రూపాయల వరకు బీమా, పరిహారం లభిస్తుందని, 18 ఏళ్ల లోపు అభ్యర్థుల నియామకానికి సంబంధించి వారి తల్లిదండ్రులు, లేదంటే సంరక్షకులు సంతకాలు చేయాల్సి ఉంటుందని వాయుసేన అధికారులు తెలిపారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో పాల్గొన్న వారికి సైనిక దళాల్లో ప్రవేశం లేదని లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురి తెల్చి చెప్పారు.