గర్భధారణ సమయంలో వైద్యులు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అంటుంటారు. తాజాగా అమెరికాలో ఓ మహిళ ప్రసవ సమయంలో ఓ అసాధారణ పని చేసి చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. ప్రసవ వేదన అంటే మళ్లీ జన్మ ఎత్తడమే. ఆ సమయంలో ఆ నొప్పిని భరించడం ఎవరి తరమూ కాదు. కానీ ఆ సమయంలో కూడా మంచి అనుభూతి కలుగాలంటే మేకప్ వేసుకుంటే సరిపోతుందని అంటున్నదో యూఎస్ మహిళ. తాను అలా చేసి చూపించింది. ఆమె ఇప్పుడు టాక్ ఆఫ్ ది వరల్డ్ అయి కూర్చొంది.
బిడ్డతో ఫోటో కోసం..
మిసిసిప్పికి చెందిన 23యేండ్ల కార్లీ టెంపుల్ ఇటీవలే తల్లి అయింది. కానీ ప్రసవ వేదన సమయంలో తనకొక ఆలోచన వచ్చింది. వెంటనే మేకప్ ఆర్టిస్ట్ ని పిలిపించుకొని వెంట్రుకల్ సెట్ చేయించుకుంది. ముఖానికి మేకప్ వేయించుకున్నది. ఇలా ఎందుకంటే.. ‘నేను ప్రసవ సమయంలో అగ్లీగా కాకుండా అందంగా కనిపించాలని అనుకున్నా. నా బిడ్డతో నేను మొదటి ఫోటో దిగినప్పుడు నేను చికాకుగా కనిపించాలని అనుకోలేదు. అందుకే మేకప్ వేయించుకున్నా’ అంటూ సెలవిచ్చింది.
ఆమే కాదు..
కార్లీ.. ‘మహిళలు జన్మనిచ్చినప్పుడ చెమటతో తడిసినట్లు కనిపిస్తారు. కానీ నా గురించి నేను మంచి అనుభూతి చెందడానికి అందంగా కనిపించాలని కోరుకున్నాను. పైగా నా చర్మం పొడి బారిపోయింది. ఆ సమయంలో ప్రసవ నొప్పులు ఉన్నా కూడా నేను తాజాగా కనిపించడం నాకే కాదు, నా చుట్టూ ఉన్నవాళ్లకు సంతోషాన్నిచ్చింది’ అని తెలియచేసింది. ప్రసవ సమయంలో ఇలా తనే కాదు, ఇంతకుముందు 27యేండ్ల అల్హా మజీద్ అనే ఆమె కూడా మేకప్ వేయించుకుంది. అమెరికన్ సూపర్ మోడల్ నటి హెడీ మెంటాగ్ కూడా గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు తన అనుభవాల్ని చిత్రాలు, వీడియో రూపంలో రికార్డ్ చేసింది. ఆమె కూడా ఇలాగే ఆపరేషన్ థియేటర్ కి వెళ్లేటప్పుడు మేకప్ తో వెళ్లింది. అయితే వీరిని చూసినవాళ్లంతా ‘ఎవరి పిచ్చి వారికానందం’ అంటూ కామెంట్ చేస్తున్నారు.