మద్యం ధరలు తెలంగాణలోనే తక్కువ.. ఆంధ్రాలో వాయింపే  - MicTv.in - Telugu News
mictv telugu

మద్యం ధరలు తెలంగాణలోనే తక్కువ.. ఆంధ్రాలో వాయింపే 

December 17, 2019

తాగడం ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. చిన్నా,పెద్ద, ముసలీ ముతకా తేడా లేకుండా మద్యానికి అలవాటుపడుతున్నారు. ఇదే ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయింది. ప్రభుత్వాలు,పాలకులు ఎవరు మారినా ఖజానా నిండేందుకు ప్రధాన మార్గంగా మద్యం విక్రయాలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మద్యానికి గిరాకీ భారీగానే ఉంది. మద్యం ప్రియులు పెరిగిపోవడంతో  వైన్ షాపుల టెండర్లకు కూడా లక్షలు కట్టి మరీ పోటీగా దక్కించుకున్నారు. సందట్లో సడేమియా అన్నట్టుగా ప్రభుత్వాలు కూడా మద్యం ధరలు పెంచేసి మరింత ఆదాయాన్ని దండుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ధరలు ఎలా ఉన్నాయి. ప్రభుత్వ ఆదాయాలు ఎలా పెరిగిపోతున్నాయి ఈ కథనంలో తెలుసుకుందాం…

అప్పట్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం పూర్తిగా నిషేధించి ఇతర మార్గాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకున్నారు. కానీ ఆయన తర్వాత మద్యం ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఏపీలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్య నిషేదం నినాదం ఎత్తుకున్నాడు. మరి ఆదాయం తగ్గుతుందని అనుకున్నారో లేకపోతే, మరేదైనా కారణమో కానీ వచ్చే నాలుగేళ్లలో దశల వారిగా నిషేధం విధిస్తామని చెప్పారు. అన్నట్టునే బార్ల లైసెన్సులు, మద్యం షాపుల చాలా వరకు తగ్గించారు. ఇంకో అడుగు ముందుకేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం అమ్మకాలు మొదలుపెట్టారు. రాత్రి 8 గంటలకే వైన్ షాపులను మూసివేస్తున్నారు. అంతా బాగానే ఉందనుకునే సమయంలో ఒకేసారి మద్యం ధరలు భారీగా పెంచేశారు. ఆయన నిర్ణయం తర్వాత కొన్ని నెలలకే తెలంగాణ ప్రభుత్వం కూడా మద్యం ధరలు పెంచింది. 

 

లిక్కర్ వినియోగం పెరగడానికి కారణం ఇదే : 

గతంలో గ్రామాల్లో గుడుంబా, సారా ప్రభావం విపరీతంగా ఉండేది. వీటి కారణంగా కల్తీ సారా దాగి చాలా మంది మరణించే వారు. గ్రామాల్లోనే సారా, గుడుంబా తయారు చేస్తుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు చితికి పోయాయి. పురుషులు తాగుడుకు భానిసగా మారి పుస్తెలు సైతం అమ్ముకొని తాగి ఇళ్లు గుల్ల చేసేవారు. కుటుంబాలన్ని రోడ్డున పడిపోయేవి. భర్త తాగుడుకు భానిస కావడంతో ఆదాయం లేక పిల్లలతో కలిసి ఆత్మహత్యలు చేసుకున్న మహిళలు ఉన్నారు. దీని కారణంగా వాడవాడలా మహిళలు ఉద్యమించారు. సారా, గుడుంబా బట్టీలు ధ్వంసం చేసి పూర్తిగా బంద్ చేయించారు. దీంతో మెల్లగా మందు బాబులు లిక్కర్ వైపు చూశారు. అప్పట్లో నాణ్యమైన మద్యం రావడంతో ఆ దిశగా ఆదరణ పెరిగింది. ఇప్పుడు సారా స్థాయిలో లిక్కర్ తాగే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. 

పెరిగిన ధరలు..  రెండు రాష్ట్రాల్లో ఇలా : 

Related image

మందుబాబుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వాలు కూడా ఉత్పత్తి పెంచేస్తున్నాయి. మధ్య మధ్యలో ధరలు పెంచుతూ  షాక్ ఇస్తున్నాయి. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ధరలు పెరిగాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

 

లిక్కర్ ధరలు :  తెలంగాణలో లిక్కర్‌పై 10 శాతం పెంచారు. అంటే గతంలో క్వార్టర్ రూ. 100కు లభిస్తే ఇక నుంచి రూ. 120కి లభించనుంది. ఫుల్ బాటిల్ పై రూ. 80 వరకు ధరలు పెరిగాయి. టీచర్స్, బ్లాక్ డాగ్, హండెడ్ పైపర్స్, స్కాచ్ వంటి ఫుల్ బాటిళ్లపై ధరను రూ. 150కి పెంచారు. 

Image result for Drinking in telangana

ఇక ఏపీ విషయానికి వస్తే దీనికి మూడొంతులు ఉంది. క్వార్టర్ సీసా గతంలో రూ.100  అమ్ముడు అయింది. కానీ పెరిగిన ధరల కారణంగా క్వార్టర్ రూ. 160 పెట్టి విక్రయిస్తున్నారు. రాయల్ స్టాగ్ క్వార్టర్ గతంలో రూ.150 కాగా ఇప్పుడు రూ. 170కి చేరింది. 

బీర్ల ధరలు 

Related image

తెలంగాణలో బీర్ల ధరలు 10 నుంచి 20 శాతానికి పెంచారు. స్ట్రాంగ్, లైట్ కేటగిరిలో వీటిని విభజించి ధరలు పెంచారు. లైట్ బీర్లపై 20 శాతం, స్ట్రాంగ్ బీర్లపై 10 శాతం ధరలు పెంచారు. అంటే ఇది వరకు రూ. 100కు లభించిన లైట్ బీర్లు ఇక నుంచి రూ. 120కి విక్రయించనున్నారు. స్ట్రాంగ్ బీర్ల విషయానికి వస్తే ఇంతకు ముందు రూ. 120కి అమ్మడు అవగా.. ఇక నుంచి వీటిని రూ. 130కి విక్రయించనున్నారు. 

 

ఇక ఏపీ విషయానికి వస్తే బీర్లపై కూడా ధరలు బాదేశారు. గతంలో రూ. 100కు అమ్ముడైన బీరును రూ. 160కి విక్రయిస్తున్నారు.

 

ఆదాయం వివరాలు ఇలా : 

Image result for liquor money

పెరిగిన ధరల కారణంగా తెలంగాణలో గతంలో పోల్చితే ఈ ఏడాది నెలకు రూ. 300 నుంచి రూ. 400 కోట్ల ఆదాయం పెరగనుంది. 2018 జనవరి నుంచి డిసెంబర్‌ వరకు ప్రభుత్వానికి రూ.20వేల కోట్ల ఆదాయం సమకూరింది. 2019 -20 సంవత్సరానికి ఆదాయం రూ. 22 వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పెరిగిన ధరలతో 2020 – 21 నాటికి మరో రూ. 3600 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది. ప్రతి ఏటా సగటున ఒక వ్యక్తి మద్యం కోసం రూ.13 వేలు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. 

 

ఇక ఏపీ విషయానికి వస్తే 2018-19లో 12.96 శాతం వృద్ధితో రూ.17.340 కోట్ల ఆదాయం వచ్చింది.2018-19లో వచ్చిన ఆదాయం రూ. 6,222 కోట్లు కాగా  2019-20లో ఎక్సైజ్ ఆదాయం 8,51,8 కోట్లు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్త మద్యం పాలసీ వచ్చాక ప్రభుత్వ ఆధ్వర్యంలో వైన్ షాపులు నడుస్తున్నాయి. మద్యం విక్రయాల సమయం కుదించడం, బెల్టు షాపులు లేనికారణంగా  ఆదాయం ఎలా ఉంటుందనేది తేలాల్సి ఉంది. 

నేరాల్లో లిక్కర్ పాత్ర ఎక్కువే..

Image result for rape

నేషనల్‌‌ క్రైం రికార్డ్స్‌‌ బ్యూరో (ఎన్‌‌ఆర్‌‌సీబీ) లెక్కల ప్రకారం మహిళలపై జరుగుతున్న నేరాల్లో 70 శాతం వరకు నేరాలు మద్యం మత్తులోనే జరుగుతున్నాయని తేలింది. హైవేలపై మద్యం విక్రయాలు, రాత్రివేళల వరకు షాపుల నిర్వాహణ, విచ్చల విడి బెల్టు షాపుల కారణంగా ఇవి పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఏటా మద్యం మత్తులో చేసే నేరాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జరిగిన దిశ, సమత కేసుల్లో నిందితులు తాగిన మత్తులోనే ఘాతుకాలకు పాల్పడ్డారు. దొంగతనాలు, హత్యలు, దారిదోపిడీలు ఇలా అన్ని మద్యం మత్తులోనే జరుగుతున్నాయి. 

పూర్తి నిషేధం ఉన్న రాష్ట్రాలు

Related image

గుజరాత్, మిజోరం, నాగాలాండ్, బిహార్ రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో మద్య నిషేధం అమల్లో ఉంది. బిహార్ 2016లో మద్యం నిషేధించింది. నితీశ్ కుమార్ మరోసారి అధికారంలోకి వచ్చాక దీన్ని అమలు చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ కావడంతో దీన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. మద్యం ద్వారా ఆదాయాన్ని ప్రభుత్వానికి సమకూర్చుకోకుండా ఆయన ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకున్నారు.