కర్నూలులో తేడా దొంగ.. ఇంట్లో పెట్టుకుని అదో తుత్తి.. - MicTv.in - Telugu News
mictv telugu

కర్నూలులో తేడా దొంగ.. ఇంట్లో పెట్టుకుని అదో తుత్తి..

May 9, 2022

దొంగ అంటే తన కళ్లముందు ఏ వస్తువు కనబడినా, ఇట్లే కొట్దొస్తాడని మనకు తెలుసు. కానీ, ఓ దొంగ మాత్రం విచిత్రంగా తన కళ్లముందు ఎంతో ఖరిదైన బైకులు ఉన్నా, వాటిని పట్టించుకోకుండా తను ఏ బైకునైతే దొంగిలించాలి అని అనుకుంటాడో దానినే మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు. ఖర్మ కాలి అరెస్టూ అయ్యాడు. ఏపీలోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి చెందిన 54 ఏళ్ల గంటా రాముడు చిన్నతనం నుంచి జులాయిగా తిరిగేవాడు. రాముడు టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ బైక్‌ మాత్రమే నడిపేవాడు. ఎక్కడ టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ బైకు కనిపించినా, తన దృష్టి బైక్‌మీదే ఉంచేవాడు. తన ఇంటి నిండా టీవీఎస్‌ బైకులు నింపాలన్న చిలిపి కోరికతో రాముడు ఈ దొంగతనాలకు బానిసయ్యాడు. నంద్యాల, ఆత్మకూరు, కర్నూలు, నందికొట్కూరు ప్రాంతాల్లో బైకు దొంగతనాలకు పాల్పడేవాడు. రద్దీగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుని, అతనికి నచ్చిన టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ బైకు వద్ద వెళ్లి, ఎవరూ లేని సమయంలో దాన్ని దొంగిలించి, వాహనంపై పరారయ్యేవాడు.

గత నెలలో రాముడు నంద్యాల గాంధీచౌక్‌ సెంటర్‌లో ఒక దుకాణం ముందు నిలిపిన బైకును చోరీ చేయడంతో బాధితుడు ఫిర్యాదు చేశాడు. దాంతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. రాముడు బైక్‌ ఎత్తుకెళ్లిన దృశ్యాల ఆధారంగా, కొణిదెల గ్రామానికి వెళ్లి విచారించారు. ఏకంగా 14 బైకులు దొంగిలించినట్లు ఒప్పుకుని, వాటిని ఓ పాడుబడిన మిద్దెలో దాచినట్లు రాముడు చెప్పాడు. పోలీసులు ఆ బైక్‌లను స్వాధీనం చేసుకుని, నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.